బచ్చలమల్లి రివ్యూ: అల్లరి నరేష్ సినిమా హిట్టా.. ఫట్టా..?
కథలోకి వెళ్తే...
బచ్చలమల్లి తన తండ్రిని ద్వేషిస్తాడు. కారణం? తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం, తల్లిని కష్టాల్లో వదిలేయడం. దీంతో కోపంతో రగిలిపోయిన బచ్చలమల్లి చదువుకు స్వస్తి చెప్పి, తాగుడుకి బానిస అవుతాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కావేరి (అమృత అయ్యర్) అతని జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రేమతో బచ్చలమల్లి తన అలవాట్లని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అతనిలోని మొండితనం మళ్ళీ బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బచ్చలమల్లి జీవితం ఏ మలుపు తిరిగింది? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే...
నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? బచ్చలమల్లి పాత్రలో ఆయన జీవించేశాడు. కోపం, పగ, ప్రేమ, నిస్సహాయత... ఇలా అన్ని ఎమోషన్స్‌ని అద్భుతంగా పలికించాడు. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రావు రమేష్, ప్రవీణ్, హరితేజ వంటి సీనియర్ నటులు కూడా తమ అనుభవంతో పాత్రలకు మరింత బలం చేకూర్చారు.
దర్శకుడు ఏం చేశాడంటే...
దర్శకుడు సుబ్బు కొన్ని సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించాడు. ముఖ్యంగా పెళ్లి మండపం సీన్, రావు రమేష్ ఇంటికి వెళ్ళే సీన్, ప్రీ క్లైమాక్స్‌లో రావు రమేష్‌తో సంభాషణ, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. భావోద్వేగాలను చక్కగా పండించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కానీ సినిమా కథ ఇంకా బాగుంటే థియేటర్లకు కనీసం ఒక వారం అయినా భారీ ఎత్తున రప్పించగలిగేది కానీ అక్కడే డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు.
టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయంటే...
సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. పూర్ణాచారి రాసిన పాటలు, నేపథ్య సంగీతం, సినిమామాటోగ్రఫీ అన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.
చివరిగా...
"బచ్చలమల్లి" నరేష్ కెరీర్లో ఒక డిఫరెంట్ మూవీ. నటుడిగా ఆయనకు మంచి పేరు తెస్తుంది. కానీ, కథలో ఇంకాస్త బలం ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. అయినా కానీ, నరేష్ నటన కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. మంచి కథను ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ వీకెండ్ దీన్ని స్కిప్ చేయొచ్చు.