మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..!
గత రెండు రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తుల కోసమే తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మొన్న మంచు మనోజ్, మంచు మోహన్ బాబు పరస్పరం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ప్రాణహాని ఉందంటూ ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇకపోతే మనోజ్ తనకు తన కుటుంబం నుంచి రక్షణ కల్పించాలంటూ తన భార్య మౌనికతో కలిసి డిజిపి, డిజిను కలిసి ఇంటికి వచ్చిన క్రమంలో మోహన్ బాబు ఇంటి వద్ద సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి రానివ్వలేదు.
ఏడు నెలల పాప ఉందని, లోపలికి వెళ్లాలని బ్రతిమలాడినా సరే మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ లోపలికి అనుమతించకపోవడంతో మనోజ్ గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో గొడవ బాగా జరగగా.. మోహన్ బాబు తన దగ్గర ఉన్న గన్ బయటకు తీయడంతో.. అక్కడే ఉన్న పహాడీ షరీఫ్ పోలీసులు ఎవరికైనా ముప్పు పొంచి ఉందని ఆలోచించి, వెంటనే ఆయన దగ్గరున్న గన్ లైసెన్స్ ను రద్దుచేసి సీజ్ చేశారు. ఇక అదే సమయంలో మోహన్ బాబు జర్నలిస్టుపై కూడా దాడి చేయడం జరిగింది. ఇక వెంటనే ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో హాస్పిటల్ కి తరలించారు.
ఇదిలా ఉండగా నిన్న జరిగిన సంఘటన కారణంగా పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. అనారోగ్య పరిస్థితి కారణంగా హాజరు కాలేనని తెలిపారు. దీంతో హైకోర్టులో ఈయనకు ఊరట కలిగింది. అనారోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేయగా ఆయన పిటిషన్ను హైకోర్టు ఏకీభవించింది. ఈనెల 24కు విచారణ వాయిదా వేసింది. మరి ఆరోజు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. మరొకవైపు జర్నలిస్టులపై దాడి చేసిన కారణంగా ఈయనపై సెక్షన్ 118 బీఎన్ఎస్ కింద కేస్ ఫైల్ చేశారు