తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొన్ని వందల మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో అందరూ సక్సెస్ కాలేదు. కొందరు మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకుని హవాను చూపించారు. అలా దాదాపు పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది టాలెంటెడ్ బ్యూటీ భూమిక చావ్లా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇక, ఈ మధ్యనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది భూమిక.ఇదిలావుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కింగ్ అక్కినేని నాగార్జున నిర్మించిన యువకుడు చిత్రం ద్వారా భూమిక వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ భూమిక అందం, నటన కుర్రకారును ఆకర్షించింది. ఆ వెంటనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖుషి బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె దశ తిరిగిపోయింది.ఈ క్రమంలో సింహాద్రి, ఒక్కడు, వాసు, స్నేహమంటే ఇదేరా, జై చిరంజీవా, సాంబ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలలో నటించి అగ్ర కథానాయకగా వెలుగొందారు.
లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కి ఆదరణ తగ్గుతున్న దశలో ఈ తరహా సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు భూమిక. మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి వంటి సినిమాలు ఘన విజయం సాధించి ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతున్న దశలో తమిళ ఇండస్ట్రీని కూడా ఒక చూపు చూసింది కానీ ఎందుకో కోలీవుడ్ భూమికకు అంతగా కలిసిరాలేదు. హిందీలో తెరేనామ్, రన్ వంటి చిత్రాల్లో నటించింది.ఇదిలావుండగా తన చిరకాల స్నేహితుడు, ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు భూమిక చావ్లా. పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌లో తన వయసు, ఇమేజ్‌కి తగిన పాత్రలే చేస్తున్నారు భూమిక. ఎంఎస్ ధోని బయోపిక్, మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, సినిమాల సంగతులను పంచుకుంటున్నారు . తాజాగా 46 ఏళ్ల వయసులో హార్లే డేవిడ్సన్ బైక్‌ను నడిపి సంచలనం సృష్టించారు భూమిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వయసులోనూ మీరు ఏమాత్రం తగ్గడం లేదని కొందరు చెబుతుండగా.. బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని తెలియదా అంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.