నేటి తరం సినిమా.. చూడాలంటే లక్షాధికారి కావాలంతే?
ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత సమయంలో .. ఓ నిర్మాత అంటాడు 1500 ఓ సినిమా కోసం పెట్టడం పెద్ద తప్పేం కాదు.. కానీ ప్రేక్షకుల మీద కోట్లు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ గడిపే మీకు ఎలా తెలుసు సార్.. సామాన్యుడి కష్టాల గురించి. 1500 అంటే ఒక తండ్రి పిల్లలకు సంతోషంగా కొనివ్వాలి అనుకున్న బట్టలు ఖరీదు.. 1500 అంటే పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూనే అతి కష్టం మీద భర్త జీతం నుంచి భార్య కొనుక్కున్న చీర ఖరీదు..1500 అంటే ఒక సామాన్యుడికి నెల గడిచిపోయే సరుకుల ఖరీదు.. 1500 అంటే సామాన్య ప్రేక్షకుడి వేలాది చెమట చుక్కల ఖరీదు.. జీతం వచ్చిన తర్వాత అన్ని ఖర్చులు పోను మిగిలిన ఆ పదిహేను వందలే నెల అంతా బ్రతికిస్తాం అని సామాన్యుడికి ఇచ్చే భరోసా. కానీ ఆ 1500 మీకు ఆఫ్ట్రాల్ అయిపోయిందా సార్.. అంటే మీరు అన్నమాట ప్రకారం మీరు తీసే సినిమా సామాన్యుడి కోసం కాదేమో.. లక్ష అధికారుల కోసమేనా అంటూ ఆ నిర్మాత మాటలపై ప్రతి సామాన్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
అయినా భారీ బడ్జెట్ పెడితేనే ప్రేక్షకులను మెప్పించగలం.. లాభాలు సంపాదించగలం అని ఎవరు చెప్పారు.. 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మంజుమల్ బాయ్స్ ఎంత పెద్ద హిట్ అయింది.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా ఎలా ప్రేక్షకుడిని మెప్పించింది. అంతెందుకు మూడు కోట్లతో తెరకేక్కిన స్టార్ హీరోలు లేని ప్రేమలు ఎంత బ్లాక్ బస్టర్ అయింది. సినిమా కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడం కాదు సార్ ప్రేక్షకులకు కావాల్సింది. కొత్త కథ కథనం. అది పట్టించుకోవడం మానేసి రొటీన్ కథలతో వందల కోట్లు పెడితే ఏం లాభం.. ప్రేక్షకుడిని బాదేస్తే ఏం లాభం. మంచి కథ ఉన్న చిన్న సినిమా తీసి ప్రేక్షకుడిని మెప్పించి లాభాలు పొందాలని ఆలోచన మీకు రాదా సార్ అంటూ ప్రతి సామాన్యుడు నేడు భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తూ..టికెట్ రేట్లు పెంచి సామాన్యుడికి సినిమాను దూరం చేస్తున్న ప్రతి నిర్మాతను ప్రశ్నిస్తున్నాడు.