ఆ విలక్షణ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Suma Kallamadi
యావత్ భారత దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ముందు వరుసలో ఉంటుంది. ఈ అవార్డు కోసం ఎంతోమంది పోటీపడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ అవార్డు వచ్చిందట ఇక ఆ నటుడు, టెక్నీషియన్ జీవితం సార్ధకం అయినట్టు భావిస్తారు. తాజాగా ఈ ఏడాది ఈ అవార్డుకు ప్ర‌ముఖ న‌టుడు "మిథున్ చ‌క్ర‌వ‌ర్తి" ఎంపిక‌ కావడం విశేషం. ఇక ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాగా నటుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఈ అవార్డుని అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అందుకోనున్నారు.
ఇక దీనికి సంబంధించి మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదిక‌గా పోస్టుని పెడుతూ... "మిథున్ అద్భుతమైన సినిమా జర్నీ అనేది తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భారతీయ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌లు ఎనలేనివి. అందుకే ఆయనను జ్యూరీ 'దాదాసాహెబ్ ఫాల్కే'కి ఎంపిక చేసింది. ఆయ‌న్ని ప్ర‌క‌టించ‌డం మాకెంతో గౌర‌వంగా ఉంది!" అని రాసుకొచ్చారు. ఇకపోతే ఈ క్రమంలోనే మరో విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇదే ఏడాది మిథున్‌కు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ కూడా వ‌రించిన సంగ‌తి అందరికీ తెలిసిందే.
ఇకపోతే మిథున్ చ‌క్ర‌వ‌ర్తి విషయానికొస్తే, 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన మృగయా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ఆయ‌న‌ ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా అందుకున్నారు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పారు. ఆ త‌ర్వాత 1980వ దశకంలో అయితే వరుస సినిమాలు చేస్తూ, తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. 1979లో వ‌చ్చిన‌ స్పై థ్రిల్లర్ సురక్షా చిత్రం ద్వారా ఆయ‌న‌ స్టార్‌డమ్ మరింత రెట్టింపు అయింది. ఆ తర్వాత డిస్కో డాన్సర్, ప్యార్ ఝుక్తా నహీ, డ్యాన్స్ డ్యాన్స్స‌, కసమ్ పైదా కర్నే వాలేకి, కమాండో వంటి సూప‌ర్‌ హిట్స్ చిత్రాల్లో న‌టించారు. ఈ క్రమంలో హిందీ , బెంగాలీతో పాటు క‌న్న‌డ‌, తెలుగు, ఓరియా, భోజ్ పురి చిత్రాల్లోనూ న‌టించారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన 'గోపాల గోపాల' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మ‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: