' దేవ‌ర ' మూవీపై ' నాగేశ్వ‌రి రూపాకుల ' రివ్యూ...

RAMAKRISHNA S.S.
దేవ‌ర సినిమాపై ఇప్ప‌టికే కొన్ని వంద‌ల రివ్యూలు వ‌చ్చేశాయి. ఓ కామ‌న్ మ్యాన్‌గా సినిమా చూసిన నాగేశ్వ‌రి రూపాకుల గారు రాసిన రివ్యూ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.. సినిమాపై ఆమె అభిప్రాయం యాధాతథంగా ఇక్క‌డ ప్ర‌చురిస్తున్నాం.. ఇది నాగేశ్వ‌రి గారి ధృక్కోణానికి సంబంధించింది.

దేవర ...మూవీ చూశాను. ఈ రోజే సినిమా విడుదల
సినిమా విడుదల అయిన వెంటనే అదీ థియేటర్ లో ఈలలు, గోలల మధ్య చూస్తే “ ఆ కిక్కే వేరప్పా”
అలా చూస్తేనే మేము నెల్లూరోళ్ళం. ఇది చాలాకాలం నుండి చూడాలని వేచి చూసిన సినిమా.
నేను పెద్ద పెద్ద సమీక్షలు వ్రాయను. నా మనసుకి తోచినది చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.  
మేము మధ్యాహ్నం రెండు గంటల షో కి వెళ్లాం. పెద్ద థియేటర్స్ అన్నీ ముందే బుక్ అయిపోయాయి.  మా ఇంటికి దగ్గరలో మహాలక్ష్మి థియేటర్ కి టికెట్స్ దొరకడంతో మేము మా మామగారితో సహా వెళ్లాం. ఆయన కూడా ఉత్సాహంగా ‘పదండి ముందుకు పదండి తోసుకు’  అన్నట్లు ‘పదండి దేవరకు’  అన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా నాయికానాయకులు నందమూరి తారక్ (మన జూనియర్ ఎన్టీఆర్) జాన్వీ కపూర్ అని తెలిసిందే కదా ! పాపం . ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కాన్సిల్ అయింది ఈ సినిమాకి. కారణం సరిగా తెలియదు.

ఇక సినిమాలో కథ ఎలా మొదలు అవుతుంది అంటే యతి అనే ఒక గ్యాంగ్ స్టర్ ని పట్టుకోవడానికి ఒక పోలీసు ఆఫీసర్ అజయ్ (మహేష్ బాబు పోకిరి లో ఉన్నాడే అతను) ఎర్ర సముద్రం అనే ప్రాంతానికి వస్తాడు. అక్కడ దేవర గురించిన కథ ప్రకాష్ రాజ్ అజయ్ కి చెబుతాడు. సినిమా మొదటి నుండి చివరివరకు ప్రకాష్ రాజ్ ఉంటాడు. ఇది ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిన కథ కాదు. ఊహాజనితమైన ఒక  తెలుగు మాట్లాడే ప్రజలు ఉండే ప్రదేశంలో జరిగే కథ. కథ అంతా దేవర చుట్టూ....  ఎర్ర సముద్రం చుట్టూ...   తిరుగుతుంది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక కొండ మీద నాలుగు గ్రామాలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో పెద్ద ఉంటాడు. వాళ్ళు దేవర (తారక్)  భైరవ (సైఫ్ అలీ ఖాన్) రాయప్ప(శ్రీకాంత్)  కుంజర (నటుడి పేరు తెలియదు)  అందరూ కలిసి ఉంటారు. కలిసి పని చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య ఎందుకు వైషమ్యాలు తలెత్తుతాయి అన్నది కథ.

కథ మంచికి చెడుకి పోరు. అది ఎలా అంటే సినిమా చూడాల్సిందే!
సినిమా కథ మొత్తం నేను చెప్పేస్తే మీకు చూసే ఇంట్రెస్ట్ పోతుంది.
దృశ్యపరంగా సముద్రం, కొండ, వాళ్ళు నివసించే ఊరు సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అక్కడి ఆచార వ్యవహారాలు, వారి దుస్తులు, మేక్ అప్  అన్నీ ఆ కథకు సమపాళ్ళలో ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట సముద్రం,  దానిలో తేలే పడవలు, అక్కడ జరిగే యుద్ధాలు దృశ్యపరంగా చాలా బాగున్నాయి. ఒక రాత్రి పూట రాక్షస మూకలు దేవర పై దాడి చేసే  సన్నివేశం చాలా బాగుంది. తారక్ నటన అద్భుతమ్!  నాకైతే చాలా నచ్చింది. చాలా హుందాగా ఎక్కడ ఎంత ఎమోషన్ చూపించాలో అంతే. తారక్ నటనకు వంకలేం పెడతాం?!   తన నటన, వాచికం, అభినయం, డాన్స్ , ఫైట్స్ అన్నీ .... ఏ వంకా పెట్టలేం!!

జాన్వీ కపూర్ అందంగా ఉంది. ఆ అమ్మాయికి ఏది ఇచ్చారో అది చేసింది. సినిమాలో విశ్రాంతి తరువాత అరగంట సేపు కనిపించి “చుట్టమల్లే చుట్టేసావే “ అని ఒక పాట పాడి వెళుతుంది. ఇక్కడే కొంత సాగతీత కనిపిస్తుంది. తారక్ అమ్మగా జరీనా వహాబ్ ఇంకా  గెటప్ శీను, మురళీ శర్మ తదితరులు ఉన్నారు.
సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేసాడు. విలన్ అంటే  కేవలం ఫైట్ చేయడం మాత్రమే కాదు తెలివైన వాడు కొంచెం జిత్తులమారిగా ఉంటే ఏ కథ అయినా రక్తి కడుతుంది. దర్శకుడు కొరటాల శివ కష్టం తెలుస్తుంది. సినిమాలో డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. ఎక్కువ భాగం ముఖంలో వచ్చే భావ ప్రకటనే చాలా వరకు సినిమాని నడిపిస్తుంది. థియేటర్ లో సౌండ్ ప్రాబ్లం వల్ల అనిరుద్ రవిచంద్రన్ సంగీతం గురించి ఏమీ చెప్పలేను కానీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది.

మొత్తానికి నాకు “దేవర” నచ్చింది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరు చూసి నచ్చకపోతే నన్ను బాధ్యురాలిని చేయకండి. ఇది నా వాల్... నా ఇష్టం. ఇది నా అభిప్రాయం.

- నాగేశ్వరి రూపాకుల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: