తెలుగు సినీ ప్రేక్షకులకు రమ్యకృష్ణ పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో పాటు తనదైన స్టైల్‌తో ఎంతో మంది అభిమానులను ఆమె సంపాదించుకుంది. వయసు పెరుగుతున్నా ఆమెలో అందం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పటికీ బిజీ ఆర్టిస్టుగా ఆమె వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. రజనీకాంత్‌తో ఆమె నటించిన 'నరసింహ' సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇక బాహుబలి సినిమాలో ఆమె పోషించిన శివగామి పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
సినిమాకే వన్నె తెచ్చేలా ఆమె నటించారు. ఇక దక్షణాదిలో రజనీకాంత్, చిరంజీవి వంటి సూపర్ స్టార్‌ల సరసన ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. దాదాపు అగ్ర హీరోలు అందరి సరసనా దక్షిణాదిలో ఆమె నటించారు. ఇంత గొప్ప నటి బాలీవుడ్‌లో ఎందుకు నటించలేదో అనే సందేహం ప్రేక్షకులలో తలెత్తుతుంది. అయితే బాలీవుడ్‌లో హీరోయిన్‌గానూ ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు ఆమె విరామం ఇచ్చారు. కేవలం దక్షిణాదిలోనే సినిమాలకు ఆమె పరిమితం అయ్యారు. దీనికి గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ స్వయంగా వెల్లడించారు.
రమ్య కృష్ణన్ తొంభైలలో కొన్ని బాలీవుడ్ చిత్రాలను చేశారు. ప్రేక్షకులు ఆమెను చాలా కాలంగా హిందీ చిత్రాలలో చూడలేదు. 'ఖల్ నాయక్', 'క్రిమినల్', 'శపథ్', 'బడే మియాన్ ఛోటే మియాన్' వంటి హిందీ చిత్రాలలో రమ్యకృష్ణ నటించారు. ఇన్ని మంచి సినిమాలు చేసినా బాలీవుడ్ నుంచి ఎందుకు విరామం తీసుకున్నారని అడిగితే ఆమె ఇలా సమాధానం ఇచ్చారు. "నేను విరామం తీసుకోలేదు. నిజానికి, నా సినిమాలు బాగా ఆడలేదు. తర్వాత నాకు వచ్చిన ఆఫర్లపై నేను ఆసక్తి చూపలేదు. నేను దక్షిణ భారత చిత్రాలలో నటిస్తున్నాను" అని రమ్యకృష్ణ చెప్పారు.
అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ-తమిళ చిత్రంలో తాను నటించాల్సి ఉందన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా తాను దక్షిణాది చిత్రాలలో బిజీ అయినట్లు పేర్కొన్నారు. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో తనకు మంచి సినిమాల్లో పని చేసే అవకాశం వచ్చిందన్నారు. దీంతో తన సినిమాలు విఫలమైన బాలీవుడ్ నటించే రిస్క్ చేయలేదన్నారు. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సినిమాలు హిట్ అయితేనే ఆర్టిస్టులకు మంచి పేరు ఉంటుందన్నారు. సక్సెస్ వచ్చిన సినిమాల్లో భాగమైతే నటీనటులకు ఉండే ఆనందం వేరన్నారు.