50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవం... జై బాలయ్య... జై జై బాలయ్య..!
- మాస్ డైలాగ్ చెబితే .. క్లాస్ కూడా మాస్ అవ్వాల్సిందే
- భాషపై చెక్కు చెదరని మమకారం నటసింహం సొంతం
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )
తెలుగు సినిమా పరిశ్రమ పేరు చెప్పగానే నటరత్న నందమూరి తారకరామారావు పేరు గుర్తుకొస్తుంది. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాలలో గొప్ప నటుడు గానే కాకుండా.. రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి మహానటుడు లెగసి నెత్తి మీద ఉంచుకుని.. నట వారసుడుగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అభిమానుల అంచనాలని తట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పించాలా.. అది కూడా 50 సంవత్సరాల పాటు ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో..? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ మహానటుడి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చి వరుసగా మూడుసార్లు ఓటమి లేకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించటం అంటే.. అదో సెన్సేషనల్ రికార్డు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల పాటు నిర్విరామంగా అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ అలరిస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ. నందమూరి తారక రామారావుని తమ ఇలవేల్పుల ఆరాధించిన తెలుగు ప్రజానీకం.. ఆయన వారసుడని అంతకంటే ఎత్తులో చూడాలనుకుంటుంది. ఎన్టీఆర్ పౌరాణికలు చేశారు.. జానపదాల్లో మెరిసారు. ఇక సాంఘిక సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో చారిత్రక పాత్రలు ఎన్టీఆర్ ముందు మోకరిల్లాయి. ఇంతకంటే బాలయ్య ఏం చేయగలడు..? అంతకంటే ఏం మెప్పించగలడు..? అనేది అందరి ప్రశ్న. వాటిని పటాపంచలు చేసుకుంటూ బాలయ్య ఐదు దశాబ్దాలలో సినిమా రంగంలో దూసుకుపోయాడు.
కెరీర్ తొలినాళ్లలో కమర్షియల్ కథలపై మొగ్గు చూపించిన తర్వాత.. విశ్వరూపం చూపించాడు. డైలాగ్ చెబితే బాలయ్య చెప్పాలి. ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన నిజం. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది గొప్ప హీరోలు ఉన్న.. డైలాగ్ విషయంలో ఆ డిక్షన్ ఇంకెవరికి అందలేదు. బాలయ్యకు భాష పై మమకారం ఎక్కువ.. తను మాస్ డైలాగ్ చెబితే క్లాస్ కూడా మాస్ అయిపోతుంది. పద్యాలు వల్లిస్తే మాస్ కూడా చెవులు అప్పగించేస్తుంది. ఇప్పటి హీరోలలో పౌరాణిక పాత్రలు చేసే ధైర్యం ఒక బాలకృష్ణకే ఉందన్నది నిజం. ఏ హీరో అభిమాని అయినా ఈ విషయం అంగీకరించి తీరాలి. అలాగే ఆదిత్య 369 సినిమాతో బాలయ్య సైన్స్ ఫిక్షన్ కూడా చేశారు. ఈ విషయంలో మాత్రం ఆయన తండ్రిని మించిన తనయుడే.
ఇక బాలయ్య ముందు నుంచి దర్శకులు, నిర్మాతల హీరో. ఒకసారి కథ ఒప్పుకుంటే దర్శకుడు విషయంలో వేలుపెట్టని ప్రొఫెషనలిజం.. బాలయ్యకే సొంతం. ఒక సినిమా ప్లాప్ అయితే దర్శకుడుని నిందించడం.. హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా తానే తీసుకోవటం.. బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగదు. వ్యక్తిత్వపరంగా బాలయ్య లాంటి భోళామనిషి... ఇక అన్ స్టాపబుల్ షోతో బాలయ్య.. ఈతరం జనరేషన్ కు పిచ్చపిచ్చగా కనెక్ట్ అయిపోయారు. ఈ తరం జనరేషన్ కూడా బాలయ్యను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ షో బాలయ్య లోని మరో యాంగిల్ ను బయటపెట్టింది. సినిమాలు పక్కన పెడితే.. రాజకీయాలు, సేవా రంగంలోనూ బాలయ్య వేసిన ముద్ర ప్రత్యేకమైనది.
2014లో తొలిసారి గెలిచి.. తన తండ్రి ఎన్టీఆర్, తన అన్న నందమూరి హరికృష్ణ ప్రాథినిత్యం వహించిన హిందూపురం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి.. ఔరా అనిపించి హిందూపురం ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా జరిగిన అభివృద్ధి హిందూపురంలో ఆ ఐదు సంవత్సరాలలో జరిగింది. అందుకే 2019లో ప్రతికూల పరిస్థితుల్లోనూ.. 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో బాలయ్య హిందూపురంలో విజయం సాధించారు. ఇక మొన్న 2024 ఎన్నికలలోను తన మెజార్టీ డబుల్ చేసుకుని.. వరుసగా మూడోసారి హిందూపురం గడ్డ నందమూరి అడ్డ.. అని మరోసారి ప్రూవ్ చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలయ్య చేస్తున్న సేవలు మర్చిపోలేనివి. ఈ వయసులోనూ యువ కథనాయకులతో పోటీపడుతూ జోరుగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య.
వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి మూడు వరుస సూపర్, డూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లోనే తిరిగి లేని ఫామ్‌లో ఉన్నారు. ఓవైపు హిట్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే పనులలో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా ఆదివారం బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్లో అట్టహాసంగా జరగబోతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ వేడుక బాలయ్య సినీ జీవితానికి మరుపురాని కానుకగా మిగిలిపోవాలని.. మరి కొంతకాలం తెలుగు ప్రజలు జై బాలయ్య, జై జై బాలయ్య అని నినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.