సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకదాని వెంట మరో సినిమా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాది సినిమాల మాదిరిగానే అక్కడివాళ్లు కమర్షియల్ మూవీస్ తీస్తే జనం కర్రు కాల్చి వాతపెట్టారు. దీంతో ఏ సినిమా తీయాలో, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలో తెలియక హిందీ మేకర్స్ తలపట్టుకుంటున్నారు. అసలు ఈ తలనొప్పి దేనికీ సౌత్ నుంచే టెక్నీషియన్స్‌ని, నటీనటులను తెచ్చుకుంటే పోలా అని డిసైడ్ అయ్యారు.సౌత్ ఫార్ములాతో షారుఖ్ హిట్ కొట్టడం చూసిన హిందీ జనాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. గతేడాది టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సైతం తమిళ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్‌తో సికిందర్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా చేరారు. అప్పుడెప్పుడో దంగల్ తర్వాత ఆయన తన రేంజ్‌కి తగ్గ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అందుకే తన మార్క్ చూపించాలని అమీర్ భావిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన, అరుదైన కాంబినేషన్ తెరపైకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే మాత్రం ఈ కాంబినేషన్ ఓ కొత్త చరిత్రను తిరగరాయడం కాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలతో హీరో స్థాయిలో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ , బాలీవుడ్ నటుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ తో ఓ పాన్ ఇండియా సినిమా ఫ్లాన్ చేస్తున్నట్లు ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు ఇందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయినట్లు నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.గత సంవత్సరం వచ్చిన లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే సినిమా రూపొందిస్తుండగా దాని అనంతరం కార్తీతో ఖైదీ 2 పూర్తి చేసి అమీర్‌ఖాన్‌తో సినిమాను పట్టాలపైకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మొదట ఈ సినిమా కోసం హృతిక్‌రోషన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఆపై అమీర్‌ఖాన్ తో స్టోరీ డిస్కస్ చేసి మూవీని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. 2022లో వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ ప్రస్తతం సితారే జమీన్ ఫర్ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఈ క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.