' డార్లింగ్ ' పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్..!
ఇంట్రోవర్ట్ ప్రభాస్ ఇది అందరికి తెలిసిన విషయమే. సినిమాల్లో కనిపించే హీరో.. బయట కనిపించే ప్రభాస్ ఇద్దరూ ఒక్కటే అంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే డార్లింగ్ చాలా ఇంట్రోవర్ట్. బాహుబలి నుంచి మూవీ ప్రమోషన్స్, ఈవెంట్లలో కాస్త మాట్లాడుతున్నాడు డార్లింగ్. ఇక తాజాగా జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ పడిన కష్టాలు చూస్తే మీ పొట్టచెక్కలవ్వాల్సిందే. స్టేజ్ పై మాట్లాడేందుకు.. నిలబడేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. నిన్న ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, ప్రభాస్ హాజరవ్వగా.. రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించారు. స్టేజ్ పై వీరందరిని కూర్చొబెట్టి తనదైన స్టైల్లో క్వశ్చన్స్ చేశాడు రానా. ఈ క్రమంలోనే స్టేజ్ పై ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ మోహమాటం చూసి తెగ నవ్వుకుంటున్నారు ఫ్యాన్స్.
స్టేజ్ పై రానా ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఓ కుర్రాడు వచ్చి అందరికి మైక్స్ ఇస్తున్నాడు. ముందుగా దీపికాకు మైక్ ఇచ్చి ఆ తర్వాత ప్రభాస్ చేతిలో మైక్ పెట్టాడు. మైక్ తీసుకుంటూ డార్లింగ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వాగదు. మైక్ పట్టుకుంటే మాట్లాడమంటారేమో అని వెంటనే పక్కనే ఉన్న దీపికాకు మైక్ ఇవ్వాలని చూశాడు. కానీ అప్పటికే దీపికా చేతిలో మైక్ ఉండిపోయింది. దీంతో మరో పక్కన ఉన్న కమల్ హాసన్ కు మైక్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పుడే కమల్ కు కూడా మైక్ ఇవ్వడంతో.. ఇక తప్పదు అన్నట్లు మైక్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు డార్లింగ్. అంతకు ముందు స్టేజ్ పై దీపికా పక్కన నిలబడిన ప్రభాస్.. అమితాబ్ మాట్లాడుతున్నప్పుడు తెగ సిగ్గుపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ అయినా.. ఎప్పటికీ డార్లింగ్ సాదాసీదానే.. స్టార్ డమ్ ఉన్నా సింపుల్ క్యారెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.