తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాకే హైలైట్‌గా నిలిచిన కట్టప్ప పాత్రకు మొదట బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ను అనుకున్నామని సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తెలిపారు. ''బాహుబలి పాత్ర ప్రభాస్ కోసం రాసిందే. కానీ కట్టప్ప స్థానంలో సంజయ్‌దత్‌ను అనుకున్నాం. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్‌ను సంప్రదించాం. ప్రభాస్‌తో సినిమా చేయాలని మంచి కథకావాలని రాజమౌళి కోరాడు. స్త్రీ, పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యత ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండేలన్నారు. నా దగ్గర అలాంటి కథలేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. అదేంటంటే భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గవీరుడిగా పేరొందిన వృద్ధుడు యువకులకు కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడి గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు. బాహుబలి 200 మందిని చంపి రక్తంతో తడిసిపోతాడు, కానీ అది అతని రక్తం కాదు అని.. చేతిలో కత్తి ఉన్నంతకాలం అతన్ని ఓడించలేరని చెప్తాడు. అది విన్న అతను ఆ మహావీరుడిని కలవాలని వృద్ధున్ని అడుగుతాడు. అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరున్ని ఎవరు చంపారు? అని అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకోకటి లేదని, బాహుబలిని చంపింది నేనే అని వృద్ధుడు వెల్లడిస్తాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుందని చెప్పాను. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నింటీని కలిపి కథ రాయమని మౌళి చెప్పాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాలుగు-ఐదు నెలలు పట్టింది''అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.