సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జైలర్ మూవీ 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించి మెరిసి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు..'జైలర్'లో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించారు. ఆయన కుమారుడిగా 'అశ్విన్స్' ఫేమ్ వసంత్ రవి, కోడలిగా మిర్నా మీనన్, బ్లాస్ట్ మోహన్ పాత్రలో సునీల్, కీలక పాత్రలో తమన్నా తదితరులు నటించారు. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జైలర్' సినిమా విడుదలైన తర్వాత ఇంత భారీ విజయం సాధిస్తుందని, వసూళ్ళ సునామీ సృష్టిస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు.స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రీ రికార్డింగ్ చేయక ముందు సినిమా చూసి యావరేజ్ అనుకున్నానని సక్సెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. అయితే... కమర్షియల్ పరంగా 'జైలర్' భారీ సక్సెస్ సాధించడంతో... ఆ సంతోషాన్ని చిత్ర బృందంతో పంచుకున్నారు చిత్ర నిర్మాత.'జైలర్' సక్సెస్ తర్వాత చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కార్ల పంపిణీ మొదలు పెట్టారు. సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన సూపర్ స్టార్ రజనితో పాటు దర్శకుడు దిలీప్ నెల్సన్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులకు ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చారు. అంతే కాకుండా లాభాల్లో కొంత షేర్ ను కూడా ఇచ్చారని, ముందుగా అనుకున్న పారితోషికం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారని సమాచారం.
'జైలర్' సినిమాలో మెయిన్ విలన్ రోల్ చేసిన వినాయకన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక మలయాళీ. అయితే... తమిళ సినిమాలు కూడా చేశారు. తెలుగులో 'పొగరు'గా విడుదలైన విశాల్ 'తిమిరు' ఆయనకు తమిళంలో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించారు. దాదాపు పదేళ్ళ విరామం తర్వాత 'జైలర్'తో మళ్ళీ కోలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. 'జైలర్'లో వినాయకన్ పాత్ర ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. హీరోయిజం ఎలివేట్ కావడంలో ఆయన విలనిజానిది ముఖ్య పాత్ర. అయితే... అంత అద్భుతంగా నటించిన వినాయకన్ కు రెమ్యూనరేషన్ పరంగా అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.'జైలర్'కు గాను ఆయనకు కేవలం 35 లక్షల రూపాయల పారితోషికం మాత్రమే అందిందని ఒక వార్త వైరల్ అవుతుంది.. దానిని వినాయకన్ ఖండించారు. 'జైలర్'కు తాను కేవలం 35 లక్షల రూపాయలే అందుకున్నట్లు వచ్చిన వార్తలను వినాయకన్ కొట్టి పారేశారు. ''నాకు 35 లక్షలు ఇచ్చారనేది ఒట్టి పుకారు మాత్రమే. మా నిర్మాత కళానిధి మారన్ చెవిలో ఈ మాటలు పడలేదని నేను ఆశిస్తున్నా. ప్రచారంలో ఉన్న పారితోషికం కంటే మూడు రేట్లు ఎక్కువగానే నాకు అందింది. నేను అడిగిన మొత్తం నాకు ఇచ్చారు. చిత్రీకరణలో నన్ను ఎంతో మర్యాదగా చూసుకున్నారు'' అని వినాయకన్ పేర్కొన్నారు