టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున చివరగా 'ఘోస్ట్' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు నాగ్ తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న కథల కోసం వెయిట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ గ్యాప్ లో నాగార్జున తనవంతుగా ఇతర సినిమాలను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ స్వీయ నిర్మాణంలో రూపొందిన '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాకు సంబంధించి తన వంతు సపోర్ట్ అందించారు.
కృష్ణ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 23న హిందీ తో పాటు తెలుగులోనూ థియేటర్స్ లో విడుదల కాబోతోంది. అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించగా,ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "మహేష్ భట్ గారిని కలిసి సుమారు 20 సంవత్సరాలు అయిపోయిందని కానీ ఆయన నా మనసులో ఎప్పుడు ఉంటారని, నేను కూడా ఆయన మనసులో ఉంటానని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా మహేష్ భట్ తన గురువు అని, అతను స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని, ఎంతోమందికి దారి చూపించారని అన్నారు.
ఇక మహేష్ పాటలు చేయించుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని నాగార్జున తెలిపారు. ఇక 1920 మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక నిశ్శబ్దం వచ్చింది. ఆ సమయంలో నిజంగా భయపడ్డా. నాకు హారర్ సినిమాలు చూడాలంటే చాలా భయం. కానీ ఎందుకనో ఈ సినిమా చూడాలని అనిపిస్తుంది. చూడాలని అనిపించేలా చేశారు. నిజానికి హారర్ సినిమాలు చూసినప్పుడు వచ్చే కిక్కే వేరు. కృష్ణ ఈ సినిమాని అద్భుతంగా తీశారు. అవికా గోర్ ఈమధ్య డిఫరెంట్ పాత్రలు చేస్తుంది. ఈ సినిమా ఆమె కెరియర్ లోనే పెద్ద హిట్ అవ్వాలి. జూన్ 23న సినిమా వస్తుంది అందరూ తప్పకుండా సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నట్లు" నాగార్జున తెలిపారు.