చిరంజీవి యాక్షన్ ప్లాన్ లో మార్పులు !
‘ఆచార్య’ ఇచ్చిన మెగా షాక్ నుండి తప్పించుకోవడానికి ఆ మూవీ విడుదలైన వారం రోజులకే తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. సుమారు నెలరోజులకు పైగా అమెరికాలో ఉన్న చిరంజీవి ఈమధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వెంటనే మెగా స్టార్ తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ విషయమై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి నటిస్తున్న సినిమాల లిస్టులో దర్శకుడు బాబి మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ముందు విడుదల అయ్యేలా ఆమూవీ షూటింగ్ ను పూర్తి చేసే విధంగా చిరంజీవి తన యాక్షన్ ప్లాన్ ను మార్చుకున్నాడు అన్న మాటలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు చిరంజీవి నటిస్తున్న సినిమాల లిస్టులో ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ముందు విడుదల అవుతుందని భావించారు.
మళయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ పై చిరంజీవికి కూడ మంచి ఆశలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను పక్కకు పెట్టి దర్శకుడు బాబి సినిమాను ఎందుకు ముందుకు తెస్తున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీ విడుదల తరువాత ‘గాడ్ ఫాదర్’ తరువాత ‘భోళాశంకర్’ విడుదల ఉంటుంది అన్న లీకులు వస్తున్నాయి. ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ దాదాపు పూర్తి అయిన పరిస్థితులలో ఈమూవీ సెప్టెంబర్ లో విడుదల అవుతుంది అని అంతా భావించారు.
అయితే ఇలా చిరంజీవి ఆలోచనలు మారడంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ పై మెగా స్టార్ కు సందేహాలు ఉన్నాయా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దీనితో ‘ఆచార్య’ స్ట్రోక్ చిరంజీవికి చాల గట్టిగా తగిలిందా అన్న సందేహాలు వస్తున్నాయి. మెగా స్టార్ లాంటి టాప్ హీరో కూడ ఒక భారీ ఫ్లాప్ ఎలాంటి టెన్షన్ క్రియేట్ చేస్తుందో ఈ సందర్భమే ఉదాహరణ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ప్రస్తుతం కొనసాగుతున్న చిరంజీవి అంతర్మధనం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..