మెగా బ్రదర్స్ హిట్ ఫార్ములా ఇదే..!
తమిళ్లో సముద్రఖని డైరెక్టర్ కమ్ హీరోగా చేసిన 'వినోదయ సిత్తమ్' సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడనే టాక్ వస్తోంది. ఇప్పటికే మార్పులు చేర్పులు కూడా మొదలయ్యాయని, ఈ రీమేక్‌లో సాయి ధరమ్‌తేజ్ ఒక కీ-రోల్ ప్లే చేస్తాడనే టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లానాయక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతోంది. బిజూ మీనన్ క్యారెక్టర్‌ని పవన్ కళ్యాణ్ ప్లే చేస్తే, పృథ్వీరాజ్ క్యారెక్టర్‌ని రానా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 25 గానీ, ఏప్రిల్1న గానీ రిలీజ్ కాబోతోంది. అలాగే పవన్ సెకండ్ ఇన్నింగ్స్‌ని రీమేక్‌తోనే స్టార్ట్ చేశాడు. 'వకీల్‌సాబ్' హిందీ హిట్ 'పింక్' రీమేక్‌గా వచ్చింది.
చిరంజీవి స్టోరీ సెలక్షన్‌లో చాలా జాగ్రత్త వహిస్తాడు. మాస్, యూత్, ఫ్యామిలీ ఇలా అందరికీ కనెక్ట్ అయ్యే కథలకే సైన్ చేస్తుంటాడు. ఈ థింకింగ్‌తోనే ప్రూవ్డ్ సబ్జెక్ట్స్‌కి సైన్ చేస్తున్నాడు. తమిళ్, మళయాళంలో హిట్ అయిన కథలని రీమేక్ చేస్తున్నాడు చిరు. తమిళ్ హిట్ 'కత్తి'ని 'ఖైదీ నం.150' గా రీమేక్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా హిట్‌తో చిరు, మరో రెండు రీమేక్స్‌ని లైన్‌లో పెట్టాడు. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్‌ఫాదర్' అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాలో కింగ్‌మేకర్‌గా నటిస్తున్నాడు చిరు. ఇక ఈ మూవీ మలయాళీ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ రీమేక్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు.
చిరంజీవి చాలా రోజుల తర్వాత సిస్టర్ సెంటిమెంట్‌తో చేస్తోన్న సినిమా 'భోళా శంకర్'. తమిళ హిట్ 'వేదళం' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. కీర్తి సురేశ్, చిరుకి చెల్లెలిగా నటిస్తోంది. తమన్న మెగాస్టార్‌తో జోడీ కట్టింది. ఇక 'షాడో' ఫ్లాప్‌తో ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకున్న మెహర్ రమేశ్ ఈ మూవీతోనే మళ్లీ మెగాఫోన్ పట్టాడు.