కర్నాటక : మార్చి 17 నుంచి 23 వరకు సినిమా విడుదల లేదు..ఎందుకంటే..?
టాలీవుడ్‌లో నిన్న వరుసగా తొలుత ఆర్ఆర్ఆర్, ఆ తరువాత ఆచార్య, భీమ్లానాయక్, ఎఫ్-3, సర్కారువారిపాట, రాధేశ్యామ్ వంటి సినిమాలకు సంబంధించి విడుదల తేదీలను ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధేశ్యామ్ వంటి సినిమాలు పాన్ ఇండియా లేవల్‌లో విడుదలవుతుండటంతో ప్రేక్షకులు అంచనాలు భారీగానే పెట్టుకుని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్, ఫిబ్రవరి 25న భీమ్లానాయక్, మార్చి 11న రాధేశ్యామ్, ఏప్రిల్ 28న ఎఫ్-3, ఏప్రిల్ 29న ఆచార్య, మే12న సర్కారువారి పాట, అదేవిధంగా ఏప్రిల్ నెలలోనే నాగచైతన్య థాంక్యూ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. కర్నాటక రాష్ట్రంలో మార్చి 17 నుంచి మార్చి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ సినిమాను విడుదల చేయకూడదు అని కర్నాటక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం జేమ్స్ మార్చి 17న విడుదల చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అప్పుకి గౌరవ సూచకంగా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఈ వారం రోజుల పాటు ఎలాంటి విడుదలలు లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. కర్నాటక రాష్ట్రం డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యంగా టాలీవుడ్ విడుదల తేదీలు తొలుత అనుకున్న దానికంటే కొన్ని ముందుకు, కొన్ని వెనక్కి మార్చబడ్డాయి. రాధేశ్యామ్ ముందుగా మార్చి 11న విడుదలవుతుండగా. ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల చేయనున్నారు. వారం రోజుల పాటు కర్నాటకలో ఏ సినిమా ఉండకపోవడంతో రాధేశ్యామ్‌కు కలెక్షన్ల పరంగా కాస్త ఇబ్బంది కలిగవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.