ఓ రెండు దశాబ్దాలు వెనక్కు వెళితే బిగ్ స్క్రీన్‌కు ఉన్నంత ఆదరణ టీవీకి లేదు. అసలు సినిమాల్లో ఓ మోస్తరు గుర్తింపు ఉన్న నటీనటులు కూడా టీవీ కార్యక్రమాల్లో నటించేందుకు ఏమంత సుముఖత చూపించేవారు కాదు. వాటిలో నటిస్తే తమ స్థాయి తగ్గిపోతుందని భయపడేవారు. రామాయణ్, మహాభారత్ వంటి సీరియళ్లు గొప్ప ప్రేక్షకాదరణ పొందినా అది వాటికి మాత్రమే పరిమితం. ఆ తరువాత కుటుంబ కథా సీరియళ్లకు ఆదరణ పెరగడంతో వాటిలో మంచి పేరు తెచ్చుకున్న బుల్లి తెర నటీనటులు అవకాశాలు దొరికితే వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లోపడేవారు. బుల్లితెరపై స్టార్ హీరోలు కనిపించడమంటే వింతే. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి దేశంలో అంతకుముందెన్నడూ లేని విధంగా టీవీ ప్రోగ్రాంల స్థాయిని అమాంతం పెంచేసింది ఒకే ఒక్క షో. అది కౌన్ బనేగా కరోడ్‌పతి. దానిని సుసాధ్యం చేసి చూపించిన స్టార్ బిగ్ బీ అమితాబ్ బచన్. బుల్లితెర చరిత్రలో కౌన్ బనేగా కరోడ్ పతి ఒక చరిత్ర.
జూలై 3, 2000 వ సంవత్సరంలో స్టార్ టీవీలో కౌన్ బనేగా కరోడ్‌పతి మొదటి సీజన్ మొదలైంది. అమితాబ్‌కు ఓ టీవీ ప్రోగ్రాం హోస్ట్‌గా వ్యవహరించడం అదే తొలిసారి. రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంపై ఎవరికీ మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. నిజానికి అమితాబ్ సొంత నిర్మాణ సంస్థ ఏబీసీఎల్ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న సమయమది. ఆ పరిస్థితుల్లో మొదలైన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనితరసాధ్యంగా నిర్వహించిన అమితాబ్ కారణంగా అది సాధించిన విజయం స్టార్ టీవీని భారత్‌లో నెంబర్‌వన్ స్థానానికి చేర్చింది. అంతేకాదు అమితాబ్ కు తగ్గిందనుకున్న స్టార్‌డమ్‌ను రెట్టింపు స్థాయిలో మరలా తెచ్చిపెట్టింది. అమితాబ్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా ఆరుపదులు దాటిన వయసులో ఆయనకు మళ్లీ బాలీవుడ్ మూవీ అవకాశాలనూ తెచ్చిపెట్టింది. ఆ ప్రోగ్రాం సక్సెస్ ఇండియాలో బుల్లితెర స్థాయిని వెండి తెర స్థాయికి తీసుకెళ్లింది. స్టార్ హీరో, హీరోయిన్‌లంతా టీవీ ప్రోగ్రాముల్లో చేసేందుకు క్యూ కట్టేలా చేసింది.