ఏపీ ప్ర‌భుత్వంపై హీరో సిద్ధార్థ్ ఫైర్‌..!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఈ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వ నియంత్రణ సరికాదని ఆయన చెప్పారు. మరోవైపు టికెట్ రేట్లు తగ్గించడంతో పాటు పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్థ సైతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మండిపడ్డారు.

వ‌రుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సినిమా టిక్కెట్ల రేట్ల పై పరిమితి విధించడం అనేది ఎంఆర్‌టీపీ చట్టాన్ని ఉల్లంఘించడమే అని... దయచేసి సినిమా బ‌తికేలా చూడాలని ఆయన వేడుకొన్నారు. 25 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడే విదేశాల్లో స్టూడెంట్ కార్డుతో $ 8 తో సినిమా చూశానని... ఇప్పుడు అక్కడ టిక్కెట్ రేటు $200 ఉందని సిద్ధార్థ చెప్పారు. ప్రభుత్వాలు సినిమాకంటే ఆల్కహాల్ , పొగాకు నియంత్ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని... ఈ దురాచారాలను ఆపాలని ఆయన ట్వీట్ చేశారు.

సినిమా అనేది ఎంతో మంది జీవనోపాధి అని సిద్ధార్థ్ చెప్పారు. ప్రతి రంగంలోనూ బిలియనీర్లు ఉన్నారని... కేవలం సినిమారంగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సినిమా బ‌డ్జెట్‌, స్థాయి నిర్ణయించాల్సింది నిర్మాత కాని.. వినియోగదారుడు కాదని చెప్పారు. రాజకీయ రంగంలో ఉన్న బిలియనీర్ల గురించి ఏనాడైనా ప్రశ్నించారా ? అని సిద్ధార్థ్ అన్నారు. ఒక సినిమాను క్రియేట్ చేసేందుకు తాము ఎంతో కష్టపడి పనిచేస్తామని... అలాంటి చేతులను చంపే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

ఇక నిన్న ఏపీలో రిలీజ్ అయిన అఖండ సినిమా వ‌సూళ్ల విష‌యంలో కూడా టిక్కెట్ రేట్ల త‌గ్గింపు గ‌ట్టిగానే ప్ర‌భావం చూపించింద‌ని చెపుతున్నారు. అఖండ కు ఏపీలో నిన్న ఒక్క రోజే రు. కోటి న‌ష్టం వ‌చ్చి ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: