అయోమయంలో పెద్ద సినిమాల మార్కెట్ !
ప్రస్తుతం ఎంత టాప్ హీరో సినిమా అయినప్పటికీ ఆమూవీకి వచ్చే మొదటివారం కలక్షన్స్ ను ఆధారంగా తీసుకుని బయ్యర్లు ఆమూవీలను భారీ మొత్తాలకు కొంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయంలో అనుసరిస్తున్న ధృఢవైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సినిమాల బిజినెస్ సుమారు 30 నుంచి 40 శాతం వరకు తగ్గిపోయే అవకాశం ఉంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈవిషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలను మార్చాలని ప్రయత్నం చేసిన నాగార్జున రాయబారాలు కూడ అంతగా విజయవంతం కాలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానాన్ని గవర్నమెంట్ పోర్టల్ ద్వారా నిర్వహించాలని స్థిరనిర్ణయం తీసుకోవడంతో ఈ విషయాన్ని నిర్మాతలు అంగీకరిస్తే టిక్కెట్ల రేట్ల పెంపు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా మెత్తపడుతుంది అని ఇండస్ట్రీ పెద్దలు భావించినట్లు టాక్.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితులలో చిరంజీవి కాకుండా నాగార్జునతో రాయబారాలు నడిపితే కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి అన్న ఎత్తుగడ కూడ పెద్దగా సఫలం అయినట్లు కనిపించడం లేదు అని అంటున్నారు. దీనితో డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతున్న పెద్ద సినిమాల కలక్షన్స్ పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వస్తున్నాయి.
‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ ‘అఖండ’ ‘ఆచార్య’ సినిమాల బడ్జెట్ విపరీతంగా అవ్వడంతో ఈమూవీ బయ్యర్లు ఈసినిమాలను కొనుక్కునే రేట్లకు టిక్కెట్ల రేట్ల పెంపు బెనిఫిట్ షోలు లేకుండా మొదటి వారానికి సంబంధించి రికార్డ్ కలక్షన్స్ రావు. ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినప్పటికీ రెండవ వారం ప్రారంభానికే కలక్షన్స్ తగ్గి పోతున్నాయి. దీనికితోడు జనం ఓటీటీ లకు అలవాటు పడిపోవడంతో టిక్కెట్ల రేట్ల పెంపు విషయం తేలకపోతే పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు తల పట్టుకుంటున్నాయి..