సమంత విషయమై సాక్షి వ్యూహాత్మక మౌనం?
ఒక సుప్రసిద్ధ జంట విడిపోయిన సందర్భంలో ఎవ్వరైనా ఒక ఆసక్తితో కథనాలు ఆశిస్తారు. కానీ ఈ సారి సాక్షి ఎందుకనో అస్సలు ఆ వ్యవహారం ఏమీ పట్టని విధంగానే కథనాలు రాసింది. అదేవిధంగా అస్సలు విశ్లేషణాత్మక కథనాలు అందించలేదు. ఇదే రీతిలో ఈనాడు కూడా స్పందించినా ఏ మాటకు ఆ మాట ఫస్ట్ పేజ్ లో ఇండికేటర్ ఇచ్చి కాస్త ఆసక్తి తీసుకువచ్చేందుకు ప్రయత్నించా రు. ప్రాధాన్య వార్తగానే ఈ వార్తను ఉంచారు. కానీ సాక్షి ఈ వార్తను సినిమా పేజీలో ఓ మూలకు విసిరేసింది. ఎందుకనో ఆ వార్త రాసిన పద్ధతి కూడా ఏమీ బాలేదు. అంటే సొంత మనుషుల ఇంటి వివాదాలు కదా! అందుకనో ఎందుకనో పాపం! సాక్షి వ్యూహాత్మకమయిన మౌనాన్నీ, సంబంధిత ప్రామాణిక రీతిని ఆశ్రయించి అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమేమీ చేయకపోవడం ఇరు వర్గాలతోనూ చొరవా చనువూ ఉన్నా కనీసం ఆ స్థాయి ప్రయత్నం కూడా చేయకపోవడం విడ్డూరం. వింత కూడా!
విచిత్రమో విడ్డూరమో ఇవాళ నిన్నే పెళ్లాడుతా అనే సినిమా ( డైరెక్టడ్ బై కృష్ణవంశీ) విడుదలయి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. మరోవైపు చై - సామ్ విడాకుల వార్త తెలుగు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. రెండు భిన్న విషయాలే అయినప్పటికీ ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలయితే కావు. కాస్తయినా సిమిలారిటీ సెన్స్ ఉన్న విషయాలే ఇవి! మరి! ఈ వార్తను అబద్ధం చేసేందుకు ఎవ్వరయినా ప్రయత్నం చేయలేదా? ఇంతటి అపకీర్తిని అక్కినేని కుటుంబం ఎందుకని మోస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన ఘటనలపై, వాగ్వాదాలపై ఎందుకని మాట్లాడడం లేదు..ఇవన్నీ మీకు అనవసరం అని అంటారా ఏంటో? గట్టిగా ప్రశ్నిస్తే!
ఈ క్రమంలో అనేక వార్తలు వండి వార్చే మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఆ మాటకు వస్తే ఒకింత అతిగా కూడా వస్తున్నాయి. కానీ వీటన్నింటి కన్నా భిన్నంగా ఆ మాటకు వస్తే ఈనాడు కన్నా భిన్నంగా స్పందించే సాక్షి ఈ సారి మాత్రం వ్యూహాత్మక మౌనానికే ప్రాధాన్యం ఇస్తుంది. సోషల్ మీడియాలో చెప్పిన నాలుగు మాటలు రాసి వదిలేసింది. వీటిపై ఎంతో ఆసక్తి ఉన్న క్రమంలో ఎందుకనో కథనాలు ఏవీ అందించలేదు.
బహుశా జగన్ కూ నాగార్జునకూ ఉన్న స్నేహం కారణంగా వాళ్లెవ్వరూ స్పందించకపోయి ఉండవచ్చు. లేదా నాగార్జున కుటుంబం నుంచి పెద్దగా స్పందనలు ఏవీ లేని కారణంగా ఎందుకు వచ్చిన తగాదా అని ఊరుకుందేమో! ఆ పాటి మాటలు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చినవే! కదా! కొత్తగా సాక్షి సాధించిందేంటి? ఇలాంటి విషయాల్లో కాస్త సానుభూతి పూర్వక కథనాలు రాసే అలవాటున్న సాక్షి ఈ సారి సొంత కుటుంబం వ్యవహారం అని భావించి వదిలేసిందేమో అని భావించాలి అంతా! అంతకుమించి సాక్షి నుంచి ఏమీ కోరుకోకూడదు లేదా ఆశించకూడదు.