
సస్పెన్స్ గా మారిన అక్టోబర్ 10 !
ఈమధ్య ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో అనుసరిస్తున్న విధానానికి కలత చెంది పవన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. పవన్ కామెంట్స్ కు ధీటైన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు కూడ ఒకొక్కరుగా పవన్ పై ఏకవచన సంభోధనతో ముప్పేట దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈవివాదం అక్టోబర్ 10న జరగబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికల పై ఏమైనా ప్రభావాన్ని పరోక్షంగా చూపెడుతుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కొందరికి ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా విలక్షణ నటుడు మోహన్ బాబు పవన్ తన పై చేసిన కామెంట్స్ కు ఇచ్చిన స్పందన చూస్తుంటే అక్టోబర్ 10 ‘మా’ సంస్థ ఎన్నికలు తరువాత మోహన్ బాబు ఎదో ఒక సంచలనం చేయబోతున్నాడా అని అనిపిస్తోంది.
సినిమా టిక్కెట్ల రెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు మోహన్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటూ పవన్ మోహన్ బాబును కెలికిన సందర్భానికి మోహన్ బాబు చాల ఘాటుగా బదులు ఇచ్చిన తీరులో అనేక సందేహాలు కలుగుతున్నాయి.
"నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు 'మా' ఎలక్షన్స్ జరుగుతున్నాయి.నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వుచేయవలసిన ముఖ్యమైన పని..నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ వెరీమచ్.." అంటూ మోహన్ బాబు స్పందించిన తీరు చూస్తుంటే ‘మా’ సంస్థ ఎన్నికల తరువాత మంచు విష్ణు ఫలితంలో ఏదైనా తేడా వస్తే మోహన్ బాబు తన విశ్వరూపాన్ని చూపెట్టడమే కాకుండా మళ్ళీ ఇండస్ట్రీ రాజకీయాలు ఊపు అందుకుని చిరంజీవి మోహన్ బాబుల భేధాభిప్రాయాలు మళ్ళీ తారా స్థాయికి చేరే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీలోని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు..