పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఉదయం నుండి ఆయనకు పలువురు ప్రేక్షకలు, అభిమానులు సహా ఎందరో సినిమా ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తుండగా, నేడు ఆయన లేటెస్ట్ సినిమాలకు సంబంధించి పలు అప్ డేట్స్ వరుసగా వస్తున్నాయి. ముందుగా ఉదయం భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ విడుదల చేసింది యూనిట్.
ఆకట్టుకునే ట్యూన్, అద్భుతమైన లిరిక్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇక దీనితో పాటు పవన్ నటిస్తున్న పీరియాడిక్ బేస్డ్ మూవీ హరిహర వీరమల్లు నుండి కూడా ఒక లేటెస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు నేడు మేకర్స్ ప్రకటించారు. ఇక పవన్ ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మించనున్న ప్రతిష్టాత్మక మూవీలో కూడా యాక్ట్ చేయనున్నారు.
అయితే కొద్దిసేపటి క్రితం ఆ మూవీ కాన్సెప్ట్ ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. పోస్ట్ లో గన్ ఫోటోతో పాటు యథా కాలమ్, తథా వ్యవహారమ్ అని రాసి ఉండడం గమనించవచ్చు. అందుతున్న సమాచారాన్ని బట్టి నేటి సమాజ పరిస్థితులకి అద్దం పడుతూ సాగే యాక్షన్ బేస్డ్ కమర్షియల్ డ్రామా మూవీగా ఇది తెరకెక్కనుండగా ఈ మూవీకి వక్కంతం వంశీ కథని అందిస్తున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు. కాగా ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయనున్నారట. ఇక ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.