టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య హీరో గా కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్ధా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ లడక్ లో జరుగుతోంది. కాగా నాగ చైతన్య ఈ రోజు తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నాగచైతన్యతో కేక్ కట్ చేయించి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ఓ కేక్ ముక్కను నాగ చైతన్య కు తినిపిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకం గా ఉండబోతుందని ఇప్పటికే చైతూ వెల్లడించారు. బాల అనే పాత్రలో తాను నటిస్తున్నట్టు నాగచైతన్య స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ పాత్ర కోసం నాగ చైతన్య కొంతకాలం పాటు జిమ్ లో కసరత్తులు చేశారు. అంతేకాకుండా సైనికుడి పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో దాని కోసం చైతూ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని మేకర్స్ అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి కి డేట్స్ సమస్య ఉండటంతో ఆ పాత్ర కోసం దర్శకుడు నాగచైతన్య ను సంప్రదించారు.
పాత్ర నచ్చడం తో చైతూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోగా అమీర్ ఖాన్ నటిస్తుండగా... అమీర్ ఖాన్ కు జోడిగా కరీనాకపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వాయాకాం పిక్చర్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే లాల్ సింగ్ చద్దా తో బాలీవుడ్ లో చైతూ పరిచయం అవ్వడం తో పాటు లాల్ సింగ్ చాద్ధా కు తెలుగులోనూ క్రేజ్ వచ్చింది.