సినిమా పరిశ్రమలో బాగా హిట్ అయిన సినిమాను ఒకభాష నుండి వేరే భాషలోకి రీమేక్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది వరకు ఈ విధంగా చాలా సినిమాలు రీమేక్ లు గా వచ్చి ప్రేక్షకులను రెండు భాషల్లోనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో తమిళ్ సూపర్ హిట్ మూవీ "విక్రమ్ వేద" రీమేక్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. తమిళ మాతృకలో ప్రధాన పాత్రల్లో మాధవన్ మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించి మెప్పించారు. ఇద్దరూ పోటీ పడి నటించి సినిమా అఖండ విజయాన్ని సాధించడంలో పాలుపంచుకున్నారు. ఈ సినిమా 2017 లోనే విడుదల కాగా, నాలుగు సంవత్సరాల తర్వాత రీమేక్ చేస్తుండడం విశేషం.
ఇందులో సైఫ్ అలీ ఖాన్ మరియు హృతిక్ రోషన్ లు నటించనున్నారు. ఈ సినిమాలో సైఫ్ భార్యగా మరియు హృతిక్ కు లాయర్ గా రాధికా ఆప్టే నటించబోతున్నట్లు అధికారిక సమాచారం. తమిళ్ లో తీసిన పుష్కర్ గాయత్రి లే రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ గాసిప్ బాలీవుడ్ వర్గాల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచేందుకు ఒక పాత్రను సృష్టించనున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి.
ప్రస్తుతానికయితే ఈ వార్త అజిత్ అభిమానులను హుషారులో ముంచెత్తుతోంది. కానీ ఫిలిం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది ఒక గాసిప్ లాగ మిగిలిపోనుంది. ఇది కనుక నిజమయితే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. కొన్ని సార్లు రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. మరి విక్రమ్ వేద సక్సెస్ అవుతుందా చూడాలి. కాగా ఈ సినిమాను షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యి, వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.