తేజ దర్శకత్వం వహించిన "చిత్రం" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ వాస్తవ్యుడు హీరో ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే సునామీలా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో నుండి వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ కు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ కుర్ర హీరో సినిమాలపై ఫాన్స్ కి రానురాను అంచనాలు పెరిగిపోయాయి. ఉదయ్ కిరణ్ కూడా సినిమా సినిమాకి డాన్స్ లోనూ, నటనలోనూ కొత్త మెలకువలను కనబరుస్తూ ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ వచ్చాడు. తెలుగులోనే కాక తమిళ చిత్రాల్లో కూడా నటించారు ఉదయ్. బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాయ్ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈ యంగ్ హీరో. ఇలా విజయపథంలో దూసుకుపోతున్న హీరో ఉదయ్ ఒక్కసారిగా ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయారు.
అతను తీసిన వరుస సినిమాలు పరాజయం పాలు కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు. వైవిధ్యభరిత కథలు ఎంచుకొని ప్రయత్నించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. వరుస పెట్టి చిత్రాలు తీసినా అవి నిరాశనే మిగిల్చాయి. దాంతో కొన్నాల్లు సినిమాలకు దూరం అయ్యాడు. అదే బాధతో మద్యం సేవించి మానసిక ఒత్తిడికి లోనై తను, తన భార్య విషిత నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్ లో తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మన అందరినీ విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చిన్న వయసులోనే కష్టసుఖాలను రెండింటినీ చూసి తనువు చాలించాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఎంతోమంది క్యారక్టర్ ఆర్టిస్టులు ఉదయ్ కిరణ్ పై ఎంతో అభిమానాన్ని చూపించారు.
ఉదయ్ కిరణ్ పడిన మానసిక క్షోభను ఎవరితోనూ పంచుకోకపోవడం చాలా ఆశ్చర్యమనిపిచింది. తనే ఒంటరిగా ఫెయిల్యూర్ ను తలుచుకుంటూ ఉండడం వల్లనే ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటాయని అప్పట్లో అందరూ అనుకున్న మాటలు. కానీ సమస్యలన్నింటికీ చావే పరిష్కారం కాదని తెలుసుకోలేక ముందున్న బంగారు భవిష్యత్తును ఊహించలేక తనకు ఎంతగానో అభిమానించి ప్రేమించిన అభిమానులందరినీ ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ రోజు ఉదయకిరణ్ పుట్టినరోజు, ఈయన ఆత్మ ఏ లోకాన ఉన్నా శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము.