శ్రీరెడ్డి ఎపిసోడ్ పై పరోక్షంగా స్పందించిన హీరో రానా తమ్ముడు..
తప్పులు అందరూ చేస్తుంటారని.. కాకపోతే తాను చేసిన కొన్ని తప్పులు బయటకు వచ్చాయని అన్నాడు దగ్గుబాటి అభిరామ్. తాను కూడా తప్పులు చేశానని హుందాగా ఒప్పుకుంటూనే.. ఇకపై అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పాడు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాని చెప్పాడు అభిరామ్. అలాంటి సమయంలో కుటుంబం తనకు అండగా నిలబడిందని, ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు తనకు బాగా తెలిశాయని అంటున్నాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ముందే ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో తప్పులు చేయకూడదని అర్థమైందని తెలిపాడు అభిరామ్. మొత్తమ్మీద ఎంతో మెచ్యూర్డ్ మ్యాన్ గా ఆ ఇంటర్వ్యూలో అన్ని విషయాలను చెప్పాడు అభిరామ్.
గతంలో ర్యాష్ డ్రైవింగ్ ఎపిసోడ్ తో అభిరామ్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నటి శ్రీరెడ్డి కూడా అభిరామ్ పై పలు సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు విడుదల చేశారు. దీంతో సినిమాల్లోకి రాకముందే అభిరామ్ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు. అయితే ఇప్పుడా విషయాలన్నిటిపై పరోక్షంగా స్పందించాడు అభిరామ్.
నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని తెలిపిన అభిరామ్, ముఖ్యంగా ప్రేమ, కుటుంబకథా చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కావడం మంచి అనుభవం అని అన్నారు అభిరామ్. తేజ సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని, అదే సమయంలో భయంగా కూడా ఉందని చెప్పారు. తేజ వర్క్ ఎలా ఉంటుందో.. గతంలో రానా హీరోగా చేసిన నేనే రాజు-నేనే మంత్రి సమయంలో చూశానని అన్నారు అభిరామ్. ఇటీవలే తేజ తనకు కథ చెప్పారని, తన తండ్రి సురేష్ బాబుకి కూడా అది బాగా నచ్చిందని, అదే కథతో తాను హీరోగా ఎంట్రీ ఇస్తున్నానని చెప్పాడు.