కరోనా ఎఫెక్ట్ మిగతా సినిమాలతో పోలిస్తే ఆచార్య మీదనే ఎక్కువగా పడింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సింది. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ ఆచార్య సినిమాను మే 13న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే 50శాతం సీటింగ్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి. అయినప్పటికీ ప్రేక్షకులు థియేటర్ లకు వచ్చే పరిస్థితులు లేకపోడంతో దాదాపు అన్ని సినిమా హాళ్లను మూసివేసుకున్నారు. దాంతో ఎప్రిల్, మే నెలల్లో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. వాటిలో లవ్ స్టోరీ, టక్ జగదీశ్ సహా మరికొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్య సినిమా కూడా చేరింది. ఆచార్యను వాయిదా వేస్తారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.
కానీ ఈరోజే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేసింది. కరోనా విజృంభన కారణంగా సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తుండగా జోడీగా పూజా హెడ్గే నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో రియల్ హీరో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నారు. ఇక రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా అల్లు అర్జున్ సినిమా పుష్ఫ విడుదల తేది ఆగస్టు 13న విడదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.