గత కొద్ది వారాలుగా బాలీవుడ్ వర్గాల్లో షికారు చేస్తున్న పుకార్లు ఎట్టకేలకు అధికారికంగా నిజమయ్యాయి. తమిళ దిగ్గజ దర్శకుడు ఎస్. శంకర్ బాలీవుడ్ రాంబో రణవీర్ సింగ్ తో కలిసి అపరిచితుడు రీమేక్ చేయబోతున్నారని రిలీజైన అధికారిక ప్రకటన ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధమైన శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పూర్తి అంకితభావంతో సినిమా చేయగలరా?? అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ తో కలిసి శంకర్ మూవీ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో భారీ సినిమా రూపొందించడానికి కమిటయ్యారు.
ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ భారతీయుడు-2 సినిమాని రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఈ సినిమా పూర్తి చేసేంతవరకు శంకర్ వేరే సినిమాలు చేయకూడదని అలిరాజా సుబస్కరన్ కోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. దీంతో తన కారణంగా నిర్మాత ఎందుకు ఇబ్బంది పడాలి అనే ఉద్దేశంతో శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ పునః ప్రారంభించేందుకు అంగీకరించారు.
అయితే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని హడావుడిగా పూర్తి చేస్తే అవుట్ పుట్ సరిగా రాక.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే శంకర్ ఇండియన్ 2 సినిమాకి కావలసినంత సమయం కేటాయించి చాలా జాగ్రత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా ఫెయిలయితే చరణ్ 15వ సినిమాపై చెడు ప్రభావం పడే ప్రమాదం ఉంది.
రామ్ చరణ్ 15వ సినిమాని శంకర్ జులై లేదా ఆగస్టు నెలలో ప్రారంభిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే బాలీవుడ్ వర్గాల ప్రకారం అపరిచితుడు రీమేక్ చిత్రాన్ని శంకర్ 2022 జూన్ నెలలో ప్రారంభించనున్నారట. దీన్నిబట్టి భారతీయుడు సినిమా తో పాటు చెర్రీ 15వ సినిమా కొద్ది నెలల సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమాని హడావిడిగా పూర్తి చేసినా సినిమా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా రీమేక్ సినిమా చిత్రీకరించడానికే నాలుగైదు నెలల సమయం పడుతుంది. అదే ఒక స్టార్ హీరో తో భారీ సినిమా చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. కరోనా కాలంలో షూటింగ్ టైం పెరిగే అవకాశం కూడా ఉంది.
దీంతో శంకర్ రామ్ చరణ్ సినిమాకి ఖచ్చితంగా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉందని తెలుస్తోంది. కానీ మరోవైపు బాలీవుడ్ సినిమా చేయాల్సి ఉంది కాబట్టి ఆయన టాలీవుడ్ సినిమాని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందనే డిస్కషన్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కాస్త లేట్ అయినా చరణ్ ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అభిమానులు భావిస్తున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇటువంటి కీలకమైన సమయంలో శంకర్ తో సినిమా చేసేందుకు ఒప్పుకొని పెద్ద తప్పు చేయబోతున్నారని ప్రస్తుత పరిణామాలను బట్టి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఏదో ఒక క్లారిటీ ఇచ్చి మెగా అభిమానులలో పాజిటివ్ వైబ్స్ నింపే బాధ్యత చిత్రబృందం పై ఉంది.