డబ్బులు ఊరికే రావు -పవన్ కల్యాణ్..
గతంలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని స్థాపించినా.. పెద్దగా సినిమాలు చేయలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది అన్నారు కానీ అది కూడా కార్యరూపం సాధించలేదు. దీంతో పవన్ కల్యాణ్ నిర్మాతగా వెనక్కు తగ్గారని అనుకున్నారంతా. అయితే ఇటీవల వరుస సినిమాలతో జోరుమీదున్న పవర్ స్టార్, తన ప్రొడక్షన్ హౌస్ కి కూడా మరమ్మతులు చేసి గాడిలో పెట్టారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలసి ముందగుడు వేశారు.
కొత్తగా రచయిత, దర్శకుడు కావాలని కలలు కనే యువతకు శుభవార్త వినిపించాయి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు. చిన్న, మధ్య తరహా, భారీ బడ్జెట్ లతో 15 చిత్రాల్ని సంయుక్తంగా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాయి. రచన, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న యువతను ఇందులో భాగస్వామిని చేయబోతున్నట్టు ప్రకటించాయి.
కొత్త ఆలోచనల్ని, విభిన్న రకాల కథల్ని, బహుభాషల్లో తెరకెక్కించగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాణ సంస్థలు తెలియజేశాయి. హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యత వహిస్తారని చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి టీజీ విశ్వ ప్రసాద్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్స్క్కి పవన్ కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తీయాలనే ప్రపోజల్ చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు పీపుల్ మీడియా బ్యానర్ భాగస్వామిగా మారడంతో.. బాబాయ్ బ్యానర్ లో అబ్బాయ్ సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రెండు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో రాబోయే 3 భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి పవన్ కల్యాణ్ తో మరొకటి రామ్ చరణ్ తో ఉండొచ్చని సమాచారం.