రేణు దేశాయ్ సినిమాకి పవన్ క్లాప్ కొడతారా..?

Deekshitha Reddy
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రకాల గాసిప్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిజమేనేమో అనిపించేలా కూడా ఉంటాయి. అయితే చివరకు అది జరగొచ్చు లేక జరక్కపోవచ్చు. కానీ ఆ గాసిప్ మాత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. అలాంటి గాసిప్ ఒకటి ఇటీవల కాలంలో టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. రేణు దేశాయ్ కొత్త సినిమాకి పవన్ కల్యాణ్ క్లాప్ కొడతారని అంటున్నారు.
వివాహ బంధం నుంచి విడిపోయినా.. రేణు దేశాయ్ కి పవన్ కల్యాణ్ అంటే చాలా అభిమానం. పలు ఇంటర్వ్యూలలో ఆయన గురించి గొప్పగా చెప్పేవారు రేణు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా రేణు గురించి ఎక్కడా తక్కువ చేసి మాట్లాడింది లేదు. అలాంటి మంచి రిలేషన్ వారి మధ్య ఉంది. ఇక కొడుకు, కూతురు కూడా పవన్ కల్యాణ్ తో కొన్నాళ్లు ఉండి వెళ్తుండేవారు. ఈ నేపథ్యంలో నటిగా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో పవన్ తో కలసి నటించిన రేణు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఆశీర్వాదంతో కెమెరా ముందుకి వెళ్లాలనుకుంటున్నారట. అందుకే ఆమె కొత్త సినిమా మహూర్తం షాట్ కి పవన్ క్లాప్ కొడతారని తెలుస్తోంది.
రేణుదేశాయ్‌ ప్రధాన పాత్రలో పాన్‌ ఇండియా స్థాయిలో ‘ఆద్య’ అనే సినిమా తెరకెక్కబోతోంది. ఎం.ఆర్‌.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రావ్‌.డి.ఎస్‌, రజనీకాంత్‌.ఎస్‌ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయిధన్సిక, నందినిరాయ్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘హుషారు’ ఫేమ్‌ తేజ కూరపాటి, గీతిక రతన్‌ జంటగా నటించే ఈ చిత్రంలో కీ రోల్ రేణు దేశాయ్ దే. దసరా పండగ రోజున ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ కథానాయకుడు వైభవ్‌ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. దసరా రోజు పవన్ కల్యాణ్ చేతుల మీదగా ఈ సినిమా మొదలు పెట్టాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ తో మాట్లాడారని, ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ఒకవేళ నేరుగా సెట్ లోకి రాకపోయినా.. జూమ్ యాప్ ద్వారా అయినా సరే ఆయన క్లాప్ కొడతారని, అదే తమ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. చూద్దాం ఈ గాసిప్ లో ఎంత నిజముందో దసరా రోజున తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: