అభిమాన గాయకుడిని మింగేసిన సంవత్సరం..!
ట్వంటీ ట్వంటీ రైమింగ్ బాగుంది కానీ.. ఈ ఏడాది అంతా భయానక వాతావరణమే కనిపిస్తోంది. ఒకవైపు కరోనా భయపెడుతోంటే, మరోవైపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతోన్న సంఘటనలు బాధపెడుతున్నాయి. వరుస విషాదాలతో చిత్ర పరిశ్రమ దుఃఖ సాగరంలో మునిగిపోతోంది.
సెప్టెంబర్ 25.. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం కన్నీరు పెట్టిన రోజు.. తమ అభిమాన గాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని పూజలు, ప్రార్ధనలు చేస్తోన్న లక్షలాది మందిని కన్నీటిలో తడిపిన రోజు.. గాన గంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గంధర్వలోకానికి వెళ్లిపోయిన రోజు.
ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా.. బాల సుబ్రహ్మణ్యాన్ని తాకింది. జనాలని స్వరరాగ గంగా ప్రవాహంలో విహరింపజేస్తోన్న బాలుని ఆస్పత్రి పాలు చేసింది. ఎంతో హుషారుగా ఉండే బాలు ఈ కోవిడ్‌ని జయిస్తానని ధైర్యంగానే చెప్పాడు. ఆగస్ట్ 5న ఆస్పత్రిలో చేరిన బాలుకి సెప్టెంబర్ 7న కరోనా నెగటివ్ వచ్చిందని, అతని కొడుకు ఎస్.పి.చరణ్ కూడా చెప్పాడు.
కరోనా తగ్గిపోయినా, ఊపిరితిత్తులు బలహీనమవడంతో ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నాడు బాల సుబ్రమణ్యం. కానీ ఈ 52 రోజుల పోరాటంలో పై చేయి సాధించలేకపోయాడు. వేల పాటలని లక్షలాది మంది అభిమానులకు వదిలేసి, దివిసీమకు తరలిపోయాడు బాల సుబ్రహ్మణ్యం.
మొత్తానికి 2020 వచ్చినపుడు అందరూ లక్కీ ఇయర్ అని తెగ ఫీలయిపోయారు. ఫుల్ ఎంజాయ్ చేసి.. 2020ని ఆహ్వానించారు.. కానీ రానురాను ఈ సంవత్సరం అసలు రూపం బయటపడింది. ఎక్కడో చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఎందరో అమాయకులను బలితీసుకుంది.