రాజేష్ మండూరి తో కార్నర్ అవుతున్న కొరటాల ?

Seetha Sailaja
‘ఆచార్య’ మూవీ కథ విషయమై కాపీ వివాదాలు రోజుకు ఒక టర్న్ తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఇంత వివాదం కొనసాగుతూ ఉన్నా దర్శకుడు కొరటాల ఈ వివాదం పై మౌనం వహిస్తూ స్పందించకపోవడం చాలామందికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత రాజేష్ మండూరి కొరటాలను టార్గెట్ చేస్తూ చేసిన సంచలన ఆరోపణలకు కొరటాల ఎందుకు మౌనం వహిస్తున్నాడు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.

వాస్తవానికి ‘ఆచార్య’ కథను తాను బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని వ్రాశానని ఈ కథను ఒక ప్రముఖ నిర్మాతకు చెపితే అతడు తాను చెప్పిన కథను రికార్డ్ చేసుకుని తరువాత ఆలోచించి చెపుతాను అంటూ చెప్పి తనను పంపించివేసిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే తాను చెప్పిన కథ కొరటాల కు లీక్ అయి ఇప్పుడు ‘ఆచార్య’ గా మారిందని రాజేష్ మండూరి వాదన.


అంతేకాదు ఈ విషయమై తాను రైటర్స్ అసోసియేషన్ కు సంబంధించిన పరుచూరి గోపాలకృష్ణ కు ఎన్. శంకర్ కు న్యాయం చేయమని అడిగినా తనకు స్పందన కరువైంది అంటూ రాజేష్ ఆవేదన పడుతున్నాడు. అంతేకాదు తాను వ్రాసుకున్న కథ 1990 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తన కథలో తండ్రి పాత్రను హత్య చేసిన వారి పై కొడుకు పగ సాధించే రివింజ్ డ్రామాగా తన కథ ఉంటూ దేవాలయాల భూముల అన్యాక్రాంతం చుట్టూ ఉంటుందని తాను వ్రాసుకున్న సీన్స్ ‘ఆచార్య’ లో ఉండబోతున్నాయి అంటూ రాజేష్ మండూరి వాదన.


ఒకప్పటి టాప్ డైరక్టర్ బి. గోపాల్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రాజేష్ మండూరి చెపుతున్న ఈ విషయం అంతా 2018 చివరిలో జరిగింది అంటున్నాడు. ఒక రచయిత కష్టపడి ఒక కథ వ్రాస్తే ఆ కథ రిజిస్ట్రేషన్ కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడతామని ఇంత కష్టపడినా కథలు కాపీ అవుతూ ఉండటం చాల దారుణం అని రాజేష్ అంటున్నాడు. అయితే ఒక మనిషిని పోలిన మనిషి ప్రపంచంలో ఏడుగురు ఉన్నట్లుగా రచయిత రాజేష్ మండూరి కథను ఇంచుమించు అదేవిధంగా కొరటాల మైండ్ లో తయారు అయిందా అన్నదే సమాధానంలేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: