తెగ ఫీలవుతున్న బన్నీ అభిమానులు !
2020లో సూపర్ స్టార్‌గా నిలిచిన ఒన్ అండ్ ఓన్లీ హీరో అల్లు అర్జున్. సమ్మర్ నుంచి ఈ ఏడాదిని ఆక్రమించిన కరోనా మరో హీరోని బరిలో దిగకుండా ఇంటికే పరిమితం చేసింది. దీంతో సంక్రాంతి సినిమాలే ఈ ఏడాదికి బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. అందులో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా 150 కోట్లకు పైగా వసూల్ చేసి బన్నీ రేంజ్ పెంచింది. అయినా స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి చెందడం లేదు.
అల్లు అర్జున్‌కి తెలుగు, తమిళ్ లో ఎంత స్టార్డమ్ ఉందో, నార్త్‌లోనూ అంతే గుర్తింపు ఉంది. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు బన్నీ. ఇక ఈ హీరో మాస్ సినిమాలకు అయితే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి. హిందీలో డబ్ అయిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ 'సరైనోడు'కి 300 మిలియన్ వ్యూస్ వస్తే, 'డీజే' 280 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అయితే ఈ సినిమాలు టెక్నికల్ ఇష్యూస్‌తో యూట్యూబ్ నుంచి డిలీట్ అయ్యాయి.
అల్లు అర్జున్ సినిమాలు డిలీట్ కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'జయ జానకి నాయక' హిందీ డబ్బింగ్ వెర్షన్ టాప్‌లోకి వెళ్లింది. 280 మిలియన్ వ్యూస్‌తో డబ్బింగ్ సినిమాల రేసులో బెల్లంకొండ ముందుకొచ్చాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ చాలా బాధపడిపోతున్నారు. మరి తమ హీరో కంటే తక్కువ మార్కెట్ ఉన్న బెల్లంకొండ ముందుకెళ్లాడని బన్నీ ఫ్యాన్స్ బాధపడుతున్నారా, లేక సినిమాలు డిలీట్ అయ్యాయని వాపోతున్నారా అనేది తెలియాలి.