ఆ రికార్డులని, వాటిలో ఏది బద్దలు కొట్టేనో ....??
సినిమా పరిశ్రమలో రికార్డుల జోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఒక సినిమా, అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టి పెద్ద సక్సెస్ అందుకోగానే, తదుపరి భారీ అంచనాలతో వచ్చే సినిమా, తప్పకుండా గత రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని ప్రేక్షకులు కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు రావడం, ఆపై తరచూ పాత రికార్డ్స్ కు కాలం చెల్లడం జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాలుగా అమీర్ ఖాన్ దంగల్ రూ. 2024 కోట్లు ఆర్జించగా, ఆ తరువాత బాహుబలి 2 రూ.1810 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
అయితే ఈ రెండు సినిమాల రికార్డ్స్ ని బద్దలుకొట్టి టాప్ ప్లేస్ లో నిలిచే దమ్మున్న సినిమా ఇప్పటివరకు భారతీయ వెండితెర మీద తెరకెక్కనే లేదు. అయితే ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్, అలానే రెండేళ్ల క్రితం రిలీజై సూపర్ సక్సెస్ అందుకున్న పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2, ఈ రెండిటికి మాత్రమే దంగల్, బాహుబలి 2 ల రికార్డ్స్ ని బద్దలుకొట్టగల సత్తా ఉందని అని అంటున్నారు ప్రేక్షకులు. దాదాపుగా రూ. 450 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, అద్భుతమైన విజువల్స్, యాక్షన్, ఎమోషన్ కలయికలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా పలువురు హాలీవుడ్ నటులు నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ని 1920ల కాలం నాటి నేపథ్యంతో రాజమౌళి ఎంతో గ్రాండ్ లెవెల్లో తీస్తున్నారు.
ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇక రూ.350 కోట్ల బడ్జెట్ తో కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో మొదటి భాగాన్ని మించేలా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సెట్టింగ్స్, అదిరిపోయే ఫైట్ సీక్వెన్సెస్ తో కెజిఎఫ్ చాప్టర్ 2 ని తీస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి ప్రేక్షకులు ఆశిస్తున్న విధంగా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా, గతంలోని రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఇండియాలో టాప్ వన్ సినిమాగా నిలుస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజలు ఆగాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!