నిజంగా టాలీవుడ్ కామెడీ క్వీన్ అంటే ఆమే .....!!

GVK Writings

టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. 1980, 1990 వ దశకాల్లో దాదాపుగా చాలా సినిమాల్లో శ్రీలక్షి మంచి కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు. ఒకప్పటి నటుడు, నిర్మాతైన అమర్నాథ్ కుమార్తె అయిన శ్రీలక్ష్మి, మొదటగా అన్న ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత అప్పటి దిగ్గజ దర్శకులు జంధ్యాల సినిమాలోని కామెడీ పాత్రల ద్వారా మంచి పేరు దక్కించుకున్న శ్రీలక్ష్మి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన దాదాపుగా అన్ని సినిమాల్లో కూడా పలు కామెడీ పాత్రల్లో అద్భుతంగా నటించి గొప్ప పేరు దక్కించుకున్నారు. 

ఆ తరువాత మరెందరో దర్శకులు ఆమె కోసం ప్రత్యేకంగా కామెడీ రోల్స్ సృష్టించేవారంటే అర్ధం చేసుకోవచ్చు అప్పట్లో శ్రీలక్ష్మి క్రేజ్ ఎటువంటిదో. అలానే అప్పట్లో కొందరు ప్రేక్షకులు అయితే, కేవలం శ్రీలక్ష్మి కామెడీ కోసమే కొన్ని సినిమాలకు వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయట. ఇక ఎన్టీఆర్ గారి దగ్గరి నుండి అప్పటి నటులందరి సినిమాల్లో కూడా పలు కామెడీ పాత్రల్లో నటించిన శ్రీలక్షి, తన కెరీర్ లో మొత్తం 500 వరకు సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు పలు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించిన శ్రీలక్షి, కొన్ని టివి సీరియల్స్ కూడా నటించారు. ఇటీవల కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ నటి ఐశ్వర్య రాజేష్, శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు. 

 

ఐశ్వర్య తండ్రైన రాజేష్, శ్రీలక్ష్మి అక్కా తమ్ముళ్లు. సోదరుడు రాజేష్ ని కూడా నటుడిగా పరిచయం చేసిన శ్రీలక్ష్మి, కొన్నేళ్ల తరువాత అతడు మరణించడంతో కొంత కృంగిపోయారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రీలక్ష్మి, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని, మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగితే కొంత ఆలస్యంగా అయినా గెలుపు మన తలుపు తడుతుందని తరచూ అంటుంటారు. ఆ విధంగా ఎన్నో చిత్రాల్లో తన హాస్యపు జల్లులతో మనకు గిలిగింతలు పెట్టిన శ్రీలక్ష్మి, టాలీవుడ్ కామెడీ క్వీన్ గా ఎందరో ప్రేక్షకుల మనసుల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: