
టాప్ హీరోల మధ్య ఊహించని చిచ్చు పెడుతున్న ఓటీటీ వార్ !
ఇప్పటివరకు టాప్ హీరోల సినిమాల కలక్షన్స్ వార్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండేది. కరోనా పుణ్యమా అని ధియేటర్లు మూతపడి సినిమాలు విడుదల లేకపోవడంతో ఇప్పుడు ఎవరు కలక్షన్స్ గురించి మాట్లాడుకోవడం లేదు. ఈపరిస్థితులలో బుల్లితెర మరియు ఓటీటీ మార్కెట్లకు అమాంతం డిమాండ్ పెరిగింది.
అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లకు ధీటుగా జీ5 డిస్నీ హాట్ స్టార్ ఈరోస్ సన్ నెక్ట్స్ వంటి ఓటీటీ మాధ్యమాలతో పాటు స్థానిక ఓటీటీ లు కూడ రంగంలోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈప్రయత్నాలలో ‘ఆహా’ బిజీగా ఉంటే టాలీవుడ్ లో ఆరుగురు అగ్ర నిర్మాతలు సొంత ఓటీటీల్ని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నారని వార్తలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది.
ఈ బిజెనెస్ లోకి కొణిదెల కాంపౌండ్ కూడ రాబోతోంది అన్న లీకులు వస్తున్నాయి. ఈలిస్టులో దిల్ రాజ్ సురేష్ బాబు కళ్యాణ్ రామ్ నాగార్జున లతో సహా పలువురు సొంత ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మహేష్ కాంపౌండ్ నుండి లీక్ అవుతున్న ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
రిలయన్స్ జియో ప్రారంభించే ఓటీటీ తెలుగు ప్రాంచైజ్ ని మహేష్ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జియో తెలుగు ఫ్రాంచైజ్ కి మహేష్ టీమ్ క్రియేటివ్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఈజియో ఓటీటీ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాడు అని తెలుస్తోంది. అంతేకాదు పిల్లలకి సంబంధించి ఎక్స్ క్లూసివ్ గా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను క్రియేట్ చేసి దానికి గౌతమ్ సితార ల పేర్లు కలిసి వచ్చేట్టుగా మహేష్ ఆలోచనలు కొనసాగుతున్నాయని టాక్. ఇప్పుడు ఈ వార్తలు అన్నీ ఇలా వైరల్ కావడంతో ఇప్పటి వరకు సినిమాల కలక్షన్స్ వరకు రికార్డుల వరకు కొనసాగిన టాప్ హీరోల మధ్య వార్ ఇక రానున్న రోజులలో వారివారి ఓటీటీ సంస్థల కొనసాగుతుందా అంటూ అనేకమంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..