వేటూరి లేని తెలుగు సినీపాట....!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన సుమధురమైన సాహితీ పలుకులతో ఎందరో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సాహితీవేత్త దివంగత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు. మొదట చిత్తూరు నాగయ్య గారి ద్వారా నా ఇల్లు అనే సినిమాలో నటించే అవకాశం తనకు వచ్చినప్పటికీ, తనకు మాత్రం నటనపై కంటే పాటల రచయితగానే స్థిరపడాలని ఉందని దానిని సున్నితంగా తిరస్కరించారు వేటూరి. ఆ తరువాత తొలిసారిగా కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ సినిమాలో ఆయనకు భారత నారి చరితము అనే హరికథా శ్లోకం రచించే అవకాశం లభించింది. ఇక ఆ తరువాత వేటూరి పదాల అల్లికను మెచ్చిన విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారు తన అడవి రాముడు,
అలానే కె విశ్వనాధ్ తన సిరిసిరి మువ్వా సినిమాల ద్వారా వేటూరి గారికి అవకాశాన్ని అందించారు.అక్కడి నుండి మెల్లగా ప్రారంభం అయిన వేటూరి గారి ప్రస్థానం, మెల్లగా ప్రేక్షక హృదయాలను తాకడం మొదలెట్టింది. ఆ తరువాత నుండి ఆయనకు వెల్లువలా అవకాశాలు వచ్చాయి. నాటి సూపర్ స్టార్ కృష్ణ గారి నుండి ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఎందరో హీరోలకు ఎన్నో అత్యద్భుతమైన పాటలను రాసారు వేటూరి గారు. మాతృదేవోభవ, చూడాలని ఉంది, అన్నమయ్య, ఆర్య, సాగర సంగమం, అర్జున్, యువరాజు, వేటగాడు, అడవి రాముడు, సిరిసిరి మువ్వ, ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి కలం నుండి జాలు వారిన ఆణిముత్యాలైన పాటలు కోకొల్లలు. మంచి రాసరంజికమైన పాటలు రాయాలన్నా లేదా హృదయానికి హత్తుకునే మంచి హృద్యమైన పాట రాయాలన్నా,
లేదా ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమను తెల్పేలా మంచి రొమాంటిక్ పాట రారాయాలన్నా కూడా అది వేటూరి గారికే చెల్లిందని, ఆ విధంగా ఏ సందర్భానికి తగ్గట్లుగా ఆ విధంగా గొప్ప సాహిత్యాన్ని అందించగల గొప్ప సాహితీ వేత్త వేటూరి గారు అంటూ ఎందరో నేటి పాటల రచయితలు మరియు సంగీత దర్శకులు సైతం ఆయనను ఎంతో గుర్తు చేసుకుంటుంటారు అంటే ఆయన గొప్పదనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కాగా 2010 మే లో వేటూరి గారు మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ దశాబ్దంలో ఆయన లేకుండానే టాలీవుడ్ సినిమా పరిశ్రమ ముందుకు సాగింది. ఆయన ప్రస్తుతం మన మధ్యన లేకున్నా, ఆయన రాసిన పాటలు మాత్రం ఎప్పటికీ మన మదిలో నిలిచిపోతాయి.....!!