నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమాను ప్రమోట్ చేస్తూ నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో నాగార్జున చేసిన కామెంట్స్ మీడియా వర్గాల మైండ్ ను బ్లాంక్ చేసాయి. తాను నటించిన ‘అన్నమయ్య’ సినిమా ఎలాంటి స్వచ్చమైనదో ‘మన్మధుడు 2’ మూవీ కూడ అంత స్వచ్చంగా పూర్తిగా తెలుగు డైలాగ్స్ తో ఎక్కడా ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా ఉంటుంది అంటూ ఒక వితండ వాదన చేసాడు.
అంతేకాదు ఈమూవీలో హీరో బూతులు మాట్లాడడు అని కేవలం హీరోయిన్ తనకు బూతులు నేర్పించమని అడగడంతో ఆమెకు బూతులు అలవాటు చేస్తాడు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈమూవీలో అనేక బూతు డైలాగ్స్ కు సెన్సార్ మ్యూట్ చేసింది అని వస్తున్న వార్తల పై స్పందిస్తూ అసలు ఆ డైలాగులు ఏ సందర్భంలో సినిమాలో వస్తాయో తెలియకుండా సినిమాను చూడకుండానే నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు నాగ్.
50 సంవత్సరాలు వయసులో ఉండే ఒక పెళ్ళికాని వ్యక్తి 25 సంవత్సరాల అమ్మాయితో ప్రేమలో పడ్డ పాయింట్ చుట్టూ అల్లబడిన కథ ఈమూవీ అంటూ తాను ఇష్టపడి చేసిన ఈమూవీ ఫలితం గురించి చాల టెన్షన్ పడుతున్న విషయాలను వివరించాడు. వాస్తవానికి ప్రస్తుత తన వయసు రీత్యా డీప్ రొమాంటిక్ చేయాలని తనకు ఇష్టం లేదనీ తాను కొంత కాలం క్రితం చూసిన ఒక ఫ్రెంచ్ సినిమా ప్రభావంతో ‘మన్మధుడు 2’ తీసాను అని చెపుతూ ఈమూవీ ఒక ప్రెంచ్ మూవీకి అనుసరణ అన్న క్లారిటీ ఇచ్చాడు.
బ్రిటిష్ కాలంలో పోర్చుగల్ కు వలస వెళ్ళిపోయిన ఒక తెలుగు కుటుంబం నేపధ్యంగా ఈమూవీ కథ నడవడంతో పోర్చుగల్ లో ఈమూవీని తీసిన విషయాన్ని వివరించాడు. ఈమూవీలోని డైలాగుల పై సెన్సార్ వర్గాలు కూడ తీవ్ర అభ్యంతరాలు వ్యక్త పరిచారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో క్లారిటీ ఇవ్వడం కోసం నాగ్ మీడియా ముందుకు వచ్చినా ఏకంగా ‘మన్మడుడు 2’ ను ‘అన్నమయ్య’ తో పోల్చడం వెనుక అర్ధం ఏమిటి అన్న విషయం నాగార్జునకే తెలియాలి..