హరీష్ శంకర్ చిత్రాలను వివాదాలు వీడటం లేదు. ‘డీజే’లో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఇష్యూపై అప్పట్లో పెద్ద దుమారమే నడిచింది. అన్ని అడ్డంకులను దాటుకుని హరీష్ శంకర్ ‘డీజే’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇక తాజాగా ఆయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘వాల్మీకి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది. ఇందులో వరుణ్ తేజ్ ఇంతకు ముందెన్నడూ కనిపించని క్రూరమైన లుక్‌తో కనిపిస్తున్నారు. గుబురు గడ్డం.. మాసిన జుట్టుతో కళ్లకు కాటుక పెట్టుకుని, ముఖంపై గాట్లుతో రాక్షసుడిలా కనిపిస్తున్నారు. ఈ లుక్ మెగా ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చేయగా.. అదే సందర్భంలో ‘వాల్మీకి’ కులస్తుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
టైటిల్‌తోనే కాంట్రివర్శీకి తెరతీసిన దర్శకుడు హరీష్ శంకర్.. ఈ టీజర్‌తో వివాదాన్ని మరింత రాజేశారు. ఇదిలాఉండగా.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. అయితే వాల్మీకి కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు షూటింగ్ లొకేషన్‌కి వచ్చి గొడవ చేయడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది.
‘వాల్మీకి’ అనే గొప్ప వ్యక్తి పేరును హింసాత్మక సినిమాకు ఎలా వాడుకుంటున్నారంటూ ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమే అంటూ వాల్మీకి కులస్తులు నిరసన తెలిపారు. షూటింగ్ లొకేషన్‌లో ఉన్న వరుణ్ తేజ్, హరీష్ శంకర్‌లను అక్కడ నుండి వెళ్లిపోవల్సిందిగా హెచ్చరించడంతో.. తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేశారట. దీంతో షూటింగ్ స్పాట్‌ను అనంతపురం నుండి చేవెళ్లకు షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది.
తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన ‘జిగర్తాండ’ చిత్రాన్ని ‘వాల్మీకి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు హరీష్ శంకర్. ఇందులో వరుణ్ తేజ్ నెగిటివ్ రోల్‌లో నటిస్తుండగా.. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.