తెలుగు సినిమా స్టామినా పెంచిన మెగాస్టార్

Prasad
స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత తెలుగు సినిమా రంగంలో అంతటి ఆదరణ పొందిన హీరో చిరంజీవి. చిరంజీవిగా సినీ అభిమానులను దోచుకున్న కొణిదల శివ శంకర వర ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లాలో మెగల్తూరులో 1955 సంవత్సరం ఆగస్టు 22న జన్మించారు. పునాదిరాళ్లు తో సినిమా రంగంలోకి ప్రవేశించిన చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రంతో వెండి తెర మీద తొలిసారిగా కనిపించారు. చిన్న పాత్రలతో, విలన్ పాత్రలతోనూ చిరంజీవి తన కెరీర్ ప్రారంభించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి చిత్రాలతో హీరో పాత్రలలో నటించడం ప్రారంభించారు. ఇక 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ వంటి సినిమాలు చిరంజీవికి సూపర్ స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. చిరంజీవి తో సినిమా అంటే వంద రోజుల ప్రదర్శనకు షీల్డ్ తీయారు చేసుకోవడం అనే అభిప్రాయం సినీమా వర్గాల్లో ఉండేదంటే అతిశయోక్తి కాదు. కుటుంబాలకు కుటుంబాలే అభిమానులగా ఉన్న చిరంజీవికి దేశం మొత్తం మీద మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉండటం చిన్న విషయమే. వెండి తెర మీద చిరంజీవి చేసే డాన్సులు, ఫైట్లు యువత, చిన్న పిల్లల మీద ప్రభావం చూపేవి. చిరంజీవిని అనుకరించడానికి వీరంతా ప్రయత్నిస్తుండేవారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి సినిమాలతో చిరంజీవి తెలుగు సినిమాల రేంజ్ ను ఎంతో పెంచారు. హిట్లర్, మాస్టర్, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి విభిన్న చిత్రాలతో అభిమానులను ఎంతగానో అలరించారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి త్వరలో తన 150వ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నిర్మాత గా రుద్రవీణ అనే ఉత్తమ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ హస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ ను చిరంజీవి 1980లో వివాహం చేసుకున్నారు. చిరంజీవికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా రాణిస్తుండగా, తమ్మడు పవన్ కళ్యాణ్ అగ్రహీరోగా నిలదొక్కుకున్నాడు. మరో తమ్ముడు నాగా బాబు సినీ రంగంలోనే రాణిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: