మారుమ్రోగి పోతున్న అల్లుఅర్జున్ దేశభక్తి!
1960-1970 ప్రాంతాలలో టాప్ హీరోల సినిమాలలో దేశభక్తికి సంబంధించిన పాటలను బాగా పెట్టేవారు. ముఖ్యంగా అలనాటి టాప్ హీరోలు ఎన్టీఆర్ ఎఎన్ఆర్ సినిమాలలో దేశభక్తికి సంబంధించిన పాటలు ఉండటం ఒక సాంప్రదాయంగా ఉండేది. అయితే ఆ టాప్ హీరోల హవా ముగిసి మెగా స్టార్ చిరంజీవి మ్యానియా ప్రారంభం అయిన తరువాత చిరంజీవి సినిమాలలో దేశభక్తికి సంబంధించిన పాటలు సన్నివేశాలు చాల అరుదుగా కనిపించడం ప్రారంభం అయింది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లో తిరిగి అటువంటి దేశభక్తి సెంటిమెంట్ కు సంబంధించిన పాటను పెట్టి తిరిగి అలనాటి ట్రెండ్ ను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో దేశభక్తిని పెంపొందిస్తూ విడుదలైన 'సైనిక' అనే పాట అందర్నీ బాగా ఆకర్షిస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ విశాల్-శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ పాట బాలీవుడ్ హిందీ సినిమాల ట్యూన్ లో ఉంది. ''సరిహద్దను నువ్వు లేకుంటే కనుపాప కంటినిండా నిదరపోదురా..'' అంటూ సాగే ఈ పాట ట్యూన్ రోమాలను నిక్కపొడుచుకునేలా ఉంది అంటూ బన్నీ అభిమానులు దేశభక్తితో పండుగ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా విశాల్ వాయిస్ ఈ పాటకు బాగా సరిపోయింది అంటూ బన్నీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ''సెలవే లేని సేవకా.. పనిలో పరుగే తీరిక.. ప్రాణం అంతా తేలిక.. పోరాటం నీకో వేడుకా.. ఓ సైనికా'' అంటూ రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాటతో అల్లు అర్జున్ అభిమానులు రిపబ్లిక్ డే సంబరాలను జరుపుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులలో విపరీతమైన హైక్ ను తెచ్చుకున్న ఈమూవీ స్థాయి ఈపాటతో మరో రేంజ్ కి వెళ్ళిపోతుందని ఈ మూవీ నిర్మాతలు ఆసిస్తున్నారు. ఏమైనా అల్లు అర్జున్ ద్వారా యూత్ కు మన సైనికులు చేసే త్యాగాలు తెలియడం ఒక మంచి శుభ పరిణామం అనుకోవాలి..