‘విశ్వరూపం’ విలేకరుల సమావేశం : ఆకట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Prasad
కమల్ హాసన్ తాజా చిత్రం ‘విశ్వరూపం’ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తెలుగు సినిమాకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ నేను క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అనేక మంది నాకు మద్దతుగా నిలిచారు వారందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. ‘దేశం విడిచి వెళ్లిపోతానని ఎందుకు చెప్పావు అని కొంత మంది అడుతున్నారు. నన్ను ఇబ్బంది పెడితే మళ్లీ అలాగే చెబుతాను. సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ఉండి స్వతంత్ర పోరాటం చేయలేదు’ అని కమల్ అన్నారు. అలాగే విశ్వరూపం రెండో భాగం గురించి చెబుతూ ‘ ఈ ఏడాదిలోనే విశ్వరూపం సీక్వెల్ ను విడుదల చేస్తానని, ఆ చిత్ర కథ మొత్తం ఇండియాలోనే సాగుతుందని, దానికి ‘విశ్వరూపం-2 ఇండియా’ అని టైటిల్ పెట్టనున్నట్లు’ వెల్లడించారు. ‘మూ’ అనేది వేరే చిత్రమని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ తనదైన శైలీలో స్పందించారు. ‘విశ్వరూపం విడుదలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మనం పురోగమిస్తున్నామా..తిరోగమిస్తున్నామా..అనే ఆలోచన ప్రతీ కళాకారుడిలోనూ వచ్చిందని’ అన్నారు. ‘సెన్సార్ పూర్తయిన సినిమాను ఆపే హక్కు ఎవ్వరికీ లేదని, శాంతిభధ్రతలను అదుపుచేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆవేశంగా’ మాట్లాడారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘సెన్సార్ అయిన సినిమాలను ఆగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని’ అన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘నటన, దర్శకత్వం.. విషయంలో ఇప్పటి వరకూ కమల్ హాసన్ నుంచి ఎంతో నేర్చుకున్నాం, ఇప్పుడు సినిమా తీశాక వివాదాలు వస్తే గుండెనిబ్బరంతో ఎలా ఉండాలో కూడా కమల్ తెలియచెప్పారని’ అన్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అక్కడ ఉన్నఅందర్నీ ఆకట్టుకున్నాయి. ‘కమల్ హాసన్ కంటతడి పెట్టడం బాధగా అనిపించింది. ఆయన సినిమాల ద్వారా మనకు ఎన్నో జ్జాపకాలు ఇచ్చారు.’ అని తెలిపారు. ‘చలిగా ఉందని హిమాలయాన్నీ అసహ్యించుకోలేం కదా, న్యుమోనియా ఉంటే ప్రాంతం మారి వేరే చోట ఉండాలి. హిమాలయాలు మాత్రం ఇండియాలోనే ఉంటాయని, కమల్ హాసన్ కూడా అలాంటి వారే అని’ త్రివిక్రమ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో యువహీరో ప్రభాస్ మాట్లాడుతూ ‘కమల్ హాసన్ వంటి వారి పక్కన కూర్చోవడమే గొప్ప విషయం’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ దిగ్గజాలు కె.విశ్వనాధ్, డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు,రమేష్ ప్రసాద్ తదితరలు పాల్గొని కమల్ హాసన్ కు తమ మద్దతుని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: