Money: ఆరోగ్యశ్రీ పరిమితి పెంచుతూ గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం..!

Divya
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించి ప్రోత్సహించడానికి అలాగే ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2లక్షల వరకు ఉండగా.. దానిని రూ .5లక్షల వరకు పెంచాలి అని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అలాగే త్వరలోనే ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను కూడా రూపొందించి జిల్లాలోని లబ్ధిదారులకు స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇకపోతే కొద్ది రోజుల క్రితం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న పరిమితి రూ .2లక్షలు సరిపోవడంలేదని దీనిని పెంచాలి అంటూ సీఎం కేసీఆర్ కు అనేక విజ్ఞప్తులు అందాయట. దీంతో సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచాలి అని వైద్య ఆరోగ్యశాఖ కూడా నిర్ణయించింది.  అందుకే మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించగా ఈ విషయాలపై స్పష్టత ఇచ్చారు.

ఇకపోతే నిమ్స్ స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహణ త్వరగా పూర్తి చేయాలి అని... కోవిడ్ సమయంలో కూడా ఎక్కడ చేయని విధంగా 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా చేసి ప్రజల ప్రాణాలు కాపాడిన కోటి ఈఎన్టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని.. వాటి సంఖ్యను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 103 కు పెంచింది అని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇకపోతే మరింత నాణ్యంగా డయాలసిస్ సేవలు అందించడానికి ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను రూపొందించి వినియోగించడానికి బోర్డు అనుమతించడం జరిగింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వినియోగానికి కూడా అనుమతి ఇచ్చింది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ విషయంలో తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: