డబ్బే డబ్బు : ఇవి సంపాదించకుండా డబ్బు ఎంత సంపాదించినా వ్యర్థమే
చాలామంది డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయగలం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ధనం సంపాదించినా కొన్నింటిని కొనలేము. ఈరోజుల్లో డబ్బు లేకపోతే జీవించడం కష్టమే కానీ డబ్బు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తే మాత్రం చాలా కోల్పోవాల్సి వస్తుంది. మన జీవితంలో ధనం ఎలా సంపాదించాలి...? దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి..? ధనం అంటే మనుషులు తయారు చేసిన నోట్లు, నాణేలు మాత్రమేనా...? లాంటి ప్రశ్నలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి.
పురాణాల్లో, వేదాల్లో ధనానికి సంబంధించిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. చాలామంది ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకుంటూ ఉంటారు. మన జీవితంలో డబ్బు అనేది వస్తూ పోతూ ఉంటుంది. డబ్బు అనేది కేవలం అవసరాల కోసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఒక మనిషి ఎంత డబ్బు సంపాదించినా జ్ఞానమే నిజమైన ధనం అని గుర్తుంచుకోవాలి. మనిషి ఎంత సంపాదించినా చివరకు సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటాడు.
జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో వారు మాత్రమే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఎవరైతే నాది, నేను, నా డబ్బు, నా వాళ్లు అనుకుంటూ ఉంటారో వాళ్లు ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. ధనం వల్ల అహం పెరిగి హద్దులు దాటితే మనిషి పూర్తిగా స్వార్థపరుడైపోతాడు. డబ్బు సంపాదించటంతో పాటు ఆపదలో ఆదుకునే గుణం ఉండాలి. చెడు అలవాట్లు, అతిగా దానధర్మాలు చేయడం, గొప్పలకు పోయి ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది కాదు. అదే సమయంలో అతిగా దానం చేయడం మంచిది కాదు.
ధనాన్ని మనిషే తయారు చేసినా తనకు తెలియకుండానే మనిషి ధనానికి దాసుడయ్యాడు. ధనం సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోవాలి. ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు ఇతరులకు చైతనైనంత సహాయం చేయాలి. ధనం ఎక్కువగా కూడబెట్టినా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ధనం కూడబెట్టకుండా పిసినారిలా ప్రవర్తించినా ప్రయోజనం ఉండదు. అందువల్ల అత్యాశ పడకుండా ఎవరైతే ధనాన్ని సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తారో వాళ్లు జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇతరులకు దానం చేసే గుణం లేకుండా ఎంత ధనం సంపాదించినా వ్యర్థమేనని చెప్పవచ్చు.