శాకుంతలం సినిమాపై ఆయన చేసిన విశ్లేషణ కరెక్టేనా....!!

murali krishna
సమంత , దేవ్‌ మోహన్‌  జంటగా నటించిన రీసెంట్‌ సినిమా 'శాకుంతలం'. కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' నాటికను ఆధారంగా చేసుకుని గుణశేఖర్‌ దీన్ని రూపొందించారు.
తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించారని ఆయన అన్నారు. గుణశేఖర్‌ కథను రాసిన విధానం, సినిమాని తెరకెక్కించిన విధానం బాగున్నా, సెకండాఫ్‌ వల్లే ఈ సినిమా సరిగ్గా క్లిక్‌ కాలేకపోయి ఉండొచ్చన్నారు.
''శాకుంతలం'.. నాకు ఇదొక అద్భుతమైన జ్ఞాపకం. గతంలో నేను తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసిన రోజుల్లో మొదటిసారి 'శాకుంతలం' నాటకం చూశా. మళ్లీ ఇన్నాళ్లకు గుణశేఖర్‌ ఈ కథతో సినిమా చేశారు. విభిన్నమైన ఐడియాలజీ ఉన్న దర్శకుడు, రచయిత గుణశేఖర్‌. సామాన్యంగా ఆయన తీసిన సినిమాలు చూస్తే ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. గతంలో ఆయన రానాతో 'హిరణ్యకశ్యప' తీయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ సమయంలో ఆయన మరో సోషల్‌ కథ రాసుకుని సినిమా చేయవచ్చు. కానీ, 'శాకుంతలం' చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు.
'మహాభారతం'లోని కొన్ని పేజీల్లోనే 'శాకుంతలం' కథ ఉంటుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంతోనే ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశం, భరత వంశం ఎలా మొదలైంది? భరతుడు ఎలా జన్మించాడు అనేదే ఈ కథలో కీలకం. ప్రేమ, గాంధర్వ వివాహం, శాపంతో భార్యను మర్చిపోవడం, తిరిగి వాళ్లిద్దరూ ఎలా కలుస్తారు.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలతో అభిజ్ఞాన శాకుంతలం రచించారు. దీనిని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన పలు తెలుగు చిత్రాలు సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి.
శకుంతల గర్భం దాల్చిన తర్వాత తన భర్త దుష్యంతుడిని కలవడం కోసం ఆయన రాజ్యానికి వెళ్లడం.. ఆమెను మర్చిపోయిన ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపో అని కేకలు వేయడం.. గ్రామస్థులు ఆమెను రాళ్లతో కొట్టడం వంటి సీన్స్‌ని సినిమాలో చూపించారు. నాకు తెలిసినంత వరకూ కాళిదాసు రచించిన కథలో రాళ్లతో శకుంతలను కొట్టినట్లు లేదు. స్త్రీ ప్రేక్షకులను కనెక్ట్‌ చేయడం కోసమే ఆ సీన్‌ పెట్టి ఉండొచ్చు. ఫస్టాఫ్‌లో శకుంతల, దుష్యంతులు కలుస్తారా? లేదా? అనే ఆసక్తికి ప్రేక్షకుల్లో క్రియేట్‌ చేశారు. కానీ, సెకండాఫ్‌లో ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుకు గతం గుర్తుకురావడంతో వాళ్లిద్దరూ కలిసిపోతారని చిన్నపిల్లాడికీ తెలిసిపోయేలా అనిపించింది. సినిమా కలెక్షన్స్‌పై సెకండాఫ్‌ ప్రభావం చూపించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కథను రాయడంలో కానీ, తెరకెక్కించడంలో కానీ గుణశేఖర్‌ ఎక్కడా తప్పు చేయలేదు. ఆయన అద్భుతమైన దర్శకుడు. గతంలో వచ్చిన 'శాకుంతలం' చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఫస్టాఫ్‌ అత్యద్భుతంగా ఉంది.
దుష్యంతుడు-శాకుంతల ప్రేమ, వాళ్లకు భరతుడు జన్మించడం.. ఈ కథ ఎన్ని ఏళ్లైనా సజీవం, శాశ్వతం. ఆ కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో గుణశేఖర్‌ సాహసం చేసి దీన్ని తెరకెక్కించారు. ఇక, దుర్వాసుడిగా మోహన్‌బాబు అదరగొట్టేశారు. సమంత చిన్న అమ్మాయే అయినా అద్భుతంగా నటించింది. సామ్‌-దేవ్‌మోహన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. మంచి కథలను మర్చిపోతున్న రోజుల్లో సొంత డబ్బును రిస్క్‌ చేసి ఈ సినిమా చేసినందుకు గుణశేఖర్‌ గట్స్‌కు హ్యాట్సాఫ్‌'' అని పరుచూరి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: