టెన్షన్ లో బన్నీ వాస్ ?

Seetha Sailaja

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రముఖంగా వినపడుతున్న నిర్మాతల పేర్లలో బన్నీ వాస్ పేరు ఒకటి. అల్లు అర్జున్ ప్రియమిత్రుడుగా పేరుగాంచిన బన్నీ వాస్ ఇంచుమించు అల్లు వారి కుటుంబ సభ్యుడుగా ఉండటమే కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి గీతా ఆర్ట్స్2 బ్యానర్ ను అల్లు అరవింద్ సహాయ సహకారాలతో స్థాపించి ‘భలే భలే మగాడివోయ్’ ‘గీత గోవిందం’ ‘ప్రతిరోజూ పండగే’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడంతో అతడి పేరు ఇండస్ట్రీ వర్గాలలో మారుమ్రోగిపోయింది.
 
  సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన ఇతడు రెట్టించిన ఉత్సాహంతో వరసపెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ ఆసినిమాలు అన్నీ ప్రస్తుతం వరస ఫ్లాప్ లుగా మారుతున్నాయి. ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ఈ ఫ్లాపుల చరిత్ర మొదలైంది. ఆసినిమా కథ వెరైటీగా ఉన్నప్పటికీ నేటితరం ప్రేక్షకుల అభిరుచిని అది అందుకోలేకపోయింది. ఆతరువాత విడుదలైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఏవరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంది.
 
  ఆతరువాత గోపీచంద్ మారుతీల కాంబినేషన్ లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఫ్లాప్ కావడం బన్నీ వాస్ కు బాగా షాక్ ఇచ్చింది అని అంటారు. అల్లు కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ ను హీరోగా నిలబెట్టాలని‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా తీస్తే ఆసినిమాకు ప్రశంసలు లభించాయి కానీ కలక్షన్స్ పెద్దగా రాలేదు. ఇక లేటెస్ట్ గా ఆమధ్య విడుదలైన నిఖిల్ ’18 పేజెస్’ మూవీకి కూడ ప్రశంసలు లభించాయి కానీ కలక్షన్స్ విషయంలో అంచనాలను చేరుకోలేకపోయింది.
 
‘కార్తికేయ 2’ తరువాత విడుదలైన సినిమా అయినప్పటికీ నిఖిల్ క్రేజ్ ఆసినిమాను ఏమాత్రం రక్షించలేకపోయింది. దీనితో అల్లు అరవింద్ అల్లు అర్జున్ సపోర్ట్ ఉన్నప్పటికీ బన్నీ వాస్ సక్సస్ ఫుల్ నిర్మాతగా సెటిల్ కాలేకపోతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ నిర్మాత నిర్మించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఈరోజు విడుదల కాబోతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఈ చిన్న సినిమాను ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నసందేహాలు ఉన్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: