@లవ్ మూవీ రివ్యూ: స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం..!!

Anilkumar
యువ నటీనటులు అభీ, సోనాక్షి, రామరాజు తదితరులు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం @ లవ్. శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్న తరహా కథా,కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాని మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీ నారాయణ నిర్మించడం జరిగింది. ఇక ఈరోజు (డిసెంబర్ 9) థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం...

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పల్లెటూరి నేపథ్యంలో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ సినిమా మొదలవుతుంది. ఎమ్మెల్యే శర్మ (రామరాజు) తన కూతురు విందు, రామ్ అనే ఓ గిరిజన యువకుడ్ని ప్రేమించిందని తెలుసుకొని ఎలాగైనా ఆ ప్రేమను చెడగొట్టాలని ఆ యువకుడి ప్రాంతానికి బయలుదేరుతాడు. దాని అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యే శర్మ కి ఓ గిరిజన పెద్దమనిషి పరిచయం అవుతాడు. అయితే ఆయన ఎప్పుడో గతంలో తమ ఊర్లో జరిగిన చంద్ర మాలక్ష్మి అనే జంట తాలూకు ప్రేమ కథను చెబుతాడు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం లాంటి ఆ ప్రేమ కథ విన్న తర్వాత శర్మలో ఎలాంటి మార్పు వచ్చింది..? చివరకు తన కూతురు ప్రేమను శర్మ అంగీకరించాడా? లేదా? అసలు అప్పటి జంట ప్రేమ కథకు, నేటి విందు - రామ్ ల ప్రేమ కథకు కనెక్షన్ ఏమిటి? అనేది మిగిలిన కథ..

ఇక విశ్లేషణ విషయానికి వస్తే.. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమా కథ జరిగిన నేపథ్యమే. సినిమా చూస్తున్నంత సేపు ఓ అందమైన అడవి మధ్యలోకి వెళ్లి అందులో ఉన్న పాత్రలను మనం దగ్గర్నుంచి చూస్తున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంతేకాదు సినిమాకు దర్శకుడు శ్రీ నారాయణ రాసుకున్న సున్నితమైన ప్రేమ కథ మరో ప్రధాన బలం. ముఖ్యంగా సినిమాలో ఆయన భావోద్వేదమైన పాత్రలతో ఎమోషన్స్  పండించిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాలో చూపించిన రెండు ప్రేమ కథలు కూడా ప్రేక్షకుడిని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తాయి. వీటితోపాటు దర్శకుడు టేకింగ్ సినిమాకు మంచి సహజత్వాన్ని అందించింది. సినిమాలో ప్రతి సీక్వెన్స్ కూడా ఒక ఎమోషనల్ సీన్ తో సినిమాపై మంచి ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా సహజంగా ఉంటుంది. ఇక సినిమా మొత్తంలో ప్రేమ, కులం, ప్రాంతం, జాతి వంటి సున్నితమైన అంశాలను వాటి వల్ల ఆడవాళ్లు పడుతున్న ఇబ్బందులను దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది. అలాగే నేటి సమాజంలో కుల పిచ్చితో కొంతమంది ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో వాటిని కొన్ని కఠినమైన వాస్తవాల ఆధారంగా చాలా వాస్తవికంగా చూపించడం ఆకట్టుకుంటుంది. దర్శకుడు తన స్క్రీన్ ప్లే లో ప్రతి పాత్రను కథలోకి తీసుకుపోయిన విధానం బాగుంది. సినిమాలో చంద్ర - మాలక్ష్మి లవ్ స్టోరీ మంచి ఫీల్ తో సాగుతూ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇక సినిమా చివరికి వచ్చేసరికి ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు చాలా బాగా మెయింటైన్ చేశాడు. సినిమా ముగింపుకు వచ్చేసరికి సినిమా మీద భావద్వేగంతో కూడుకున్న మంచి అనుభూతి కలుగుతుంది. అయితే సినిమాలో ఓ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాలో నటించిన వారందరూ నూతన నటీనటులు కావడంతో ఈ ఒక్క రీజన్ సినిమా స్థాయిని కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి..

సాంకేతిక విభాగం పని తీరు.. ఇక ఈ సినిమా దర్శకుడు శ్రీ నారాయణ దర్శకుడిగా రచయితగా పూర్తి న్యాయం చేశాడు. మంచి కథతో పాటు ఆసక్తికరమైన పాత్రలతో సినిమాని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. అలాగే సినిమాలో నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో వచ్చే సన్నివేశాలన్నీ చాలా సహజంగా మంచి అనుభూతిని కలిగిస్తాయి. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.

@లవ్ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

స్వచ్ఛమైన ప్రేమ కథలతో, భావోద్వేగమైన సన్నివేశాలతో సగటు ప్రేక్షకుడిని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని కోరుకునే ప్రేక్షకులకు @లవ్ మూవీ మంచి ఛాయిస్ అవుతుంది..

రేటింగ్.. 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: