రాజమౌళిపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

N.ANJI

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఒకే స్క్రీన్‌పై తండ్రీకొడుకును చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇప్పటివరకు అపజయమెరుగని డైరెక్టర్‌గా పేరుపొందిన కొరటాల శివ.. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్లు, టీజర్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా చేశారు.


ఆచార్య సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు అందరిలో ఆసక్తిని రేపాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గతంలో ఇండియన్ సినిమాలంటే కేవలం హిందీ సినిమాలు మాత్రమేనని, హిందీ సినిమాలకే ప్రత్యేక గుర్తింపు ఉండేది. అప్పుడు నాకు చాలా బాధ వేసేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తెలుగు సినిమాలు కూడా ఇండియన్ సినిమాలని గర్వపడేలా దర్శకుడు రాజమౌళి చేశారు. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు.’ అని అన్నారు.


టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ విషయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుదని చిరంజీవి పేర్కొన్నారు. ఇండియన్ సినిమా ఒక మతం అయితే.. ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి అని పేర్కొన్నారు. రాజమౌళి క్రియేట్ చేసిన స్టేజ్ వల్ల ఇప్పుడు అన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయికి వెళ్తున్నాయి. అయితే రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు.. ఆ తర్వాత వేరే డైరెక్టర్‌తో సినిమాలు చేస్తే ప్లాప్ అవుతున్నాయని అంటున్నారు.. వాస్తవానికి అది నిజం కాదన్నారు. ఇలాంటి మాటలను ‘ఆచార్య’ సినిమా తిప్పి కొడుతుందన్నారు. ఏప్రిల్ 29 వరకు వెయిట్ చేయాలని, సినిమా హిట్ అయ్యాక.. మీకే తెలుస్తుందన్నారు. అలాగే హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ లాంటి వారని, తన సినిమా పూర్తయ్యే వరకు ఎవ్వరిని వదిలిపెట్టరని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: