చిరంజీవికి హీరోయిన్‌గా, ఆపై త‌ల్లిగా చేసిన నటీమణులు ఎవ‌రెవ‌రో తెలుసా?

VUYYURU SUBHASH
సాధార‌ణంగా కొంద‌రు న‌టీమ‌ణులు హీరోల స‌ర‌స‌న హీరోయిన్‌గా ఆడి పాడి.. ఆపై వారికే అక్క‌గానో, చెల్లెగానో కూడా న‌టిస్తుంటారు. అయితే మెగా స్టార్ చిరంజీవి కెరీర్‌లో మాత్రం ఇద్ద‌రు హీరోయిన్లు ఆయ‌న‌కు జోడీగా న‌టించి.. ఆ త‌ర్వాత త‌ల్లిగా కూడా చేశారు. మ‌రి ఇంత‌కీ ఆ న‌టీమ‌ణులు ఎవ‌రు..? ఏయే సినిమాల్లో చిరంజీవికి హీరోయిన్‌గా, ఆపై త‌ల్లిగా చేశారు వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అల‌నాటి తార సుజాత చిరంజీవికు జోడీగా `ప్రేమ తరంగాలు` అనే సినిమాలో న‌టించింది. ఎస్.పి.చిట్టిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం హిందీ లో విజయవంతమైన `ముకద్దర్ కా సికందర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంది. ఇందులో రెబ‌ల్ స్టార్  కృష్ణంరాజు కూడా న‌టించారు. 1980లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవికి హీరోయిన్‌గా న‌టించిన సుజాత‌.. విజయ బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `బిగ్ బాస్` సినిమాలో ఆయ‌న‌కే త‌ల్లిగా చేసింది. మ‌రియు ఈరంకి శర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సీతా దేవి` సినిమాతో చిరంజీవికి అక్క‌గానూ సుజాత న‌టించ‌డం విశేషం.

అలాగే జయసుధ, చిరంజీవి జంట‌గా `మగధీరుడు` సినిమా చేశారు. విజయ బాపినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 1986లో విడుద‌లైంది. దీంతో పాటు కె. బాలచందర్ తెర‌కెక్కించిన `ఇది కథ కాదు` అనే చిత్రంలోనూ చిరంజీవి స‌ర‌స‌న జ‌య‌సుధ న‌టించింది. ఇక అదే జ‌య‌సుధ కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రిక్షావోడు` సినిమాతో చిరంజీవికి త‌ల్లి పాత్ర‌ను పోషించి ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంది.
కాగా, న‌టి సుజాత ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌క‌పోయినా.. జ‌య‌సుధ మాత్రం హీరోల‌కు త‌ల్లిగా న‌టిస్తూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స‌త్తా చాటుతోంది. ఇక చిరంజీవి విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ఆచార్య చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రోవైపు గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: