కృష్ణ సాధించిన ఘనతలు ఇవే..?

Suma Kallamadi
డేరింగ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలన చిత్ర రంగానికి ఎన్నో సేవలు అందించారు. ఈరోజు అనగా మే 31న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన ఘనతలు ఏంటో తెలుసుకుందాం. కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా తో తెలుగు తెరకు మొట్టమొదటిగా సినిమా స్కోప్ అనే ఒక సరికొత్త ఫిలిం మేకింగ్ విధానాన్ని పరిచయం చేశారు. ఆయన మోసగాళ్లకు మోసగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్ చిత్రాలను పరిచయం చేశారు. ఆయన కౌబాయ్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు.
ఇక ఆయన టచ్ చేసిన జానర్ లో డిటెక్టివ్ డ్రామాలు కూడా ఉన్నాయి. గూడచారి 116 సినిమాతో ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి కల్పించారు. జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చేసిన కృష్ణ ఆ తర్వాత అనేక అద్భుతమైన దృశ్య కావ్యాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చి వావ్ అనిపించారు. టాలీవుడ్ పరిశ్రమకి సింహాసనం సినిమాతో "వైడ్ హై రిజల్యూషన్ ఫిలిం ఫార్మాట్" అయిన 70mm ని కూడా పరిచయం చేశారు. తెలుగువీర లేవరా చిత్రం తో తెలుగు పరిశ్రమకి డిటిఎస్ సౌండ్ సిస్టం పరిచయం చేశారు. అత్యల్ప కాలంలో 200 సినిమాలు శరవేగంగా పూర్తి చేసిన హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన 20 సంవత్సరాల్లో రెండు వందల సినిమాలు పూర్తి చేశారంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రతి సంవత్సరం సగటున పది సినిమాలు తెరకెక్కించారు.
ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఆయనకు లభించింది. 25 సార్లు ద్విపాత్రాభినయం చేయగా 7 సార్లు త్రిపాత్రాభినయం చేశారు. ఆయన విజయనిర్మల తో కలిసి 48 సినిమాలు చేశారు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఒకే హీరోయిన్ తో 48 సార్లు నటించలేదు. జయప్రద తో 47 సార్లు శ్రీదేవి తో 30 సార్లు కలిసి సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఈ రికార్డులను బహుశా మరెవరూ బద్దలు కొట్టలేరు ఏమోగానీ కృష్ణ ఇంకా ఎన్నో ఘనతలు సాధించారు. నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా దర్శకుడిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: